న్యూ ఢిల్లీ- నందమూరి లక్ష్మీపార్వతి పేరును మార్చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా, వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శళు గప్పించే రఘురామ ఈ సారి లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు. తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతిపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు రఘురామ కృష్ణరాజు. ‘నలపా’ అంటూ నందమూరి లక్ష్మీ పార్వతికి షార్ట్ కట్ లో పేరు పెట్టారు.
నలపా అంటే నందమూరి లక్ష్మా పార్వతి అని అర్ధం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ.. తెలుగు అకాడమీ విషయంలో లక్ష్మీ పార్వతి ధోరణిని తప్పుబట్టారు. ఈ మేరకు లక్ష్మీపార్వతిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్ష్మీ పార్వతి గతంలో చక్కగా హరి కథలు చెప్పేవారంటూ రఘురామ కృష్ణరాజు వెటకారంగా మాట్లాడారు. తెలుగు అంటేనే ఎన్టీ రామారావు అని, అలాంటి వ్యక్తి భార్యగా లక్ష్మీ పార్వతి పదవుల కోసం పాకులాడటం మంచిది కాదని హితవు పలికారు.
ఎన్టీ రామారావుకు తలవంపులు తీసుకొస్తున్నారన్న అపవాదును ఆమె మూటగట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లక్ష్మీ పార్వతి మళ్లీ తెలుగును ప్రేమించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. లక్ష్మా పార్వతి తన కంటే పెద్దవారని, తను ఎంతో అభిమానించే వాడినని చెప్పారు. అయినప్పటికీ ఎన్టీఆర్ భార్య కాబట్టి లక్ష్మీ పార్వతిలో మార్పు వస్తుందని భావిస్తున్నానని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.