స్పోర్ట్స్ డెస్క్- సచిన్ టెండుల్కర్.. క్రికెట్ అభిమానుల దేవుడు. క్రికెట్ ఆటకు కొత్త అర్ధాన్ని చెప్పిన చిచ్చరపిడుగు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు సచిన్. ఇక ప్రపంచంలో అత్యధిక కాలం క్రికెట్ ఆడిన రికార్టు ఇప్పటికీ సచిన్ టెండుల్కర్ పేరు మీదే ఉంది. ఆ రికార్డును ఇప్పుడు మిధాలీ రాజ్ బద్దలు కొట్టబోతోందట. అవును టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నిన్న ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో ఆడిన మిథాలీ, క్రికెట్‌లో అడుగుపెట్టి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో ఓ అరుదైన రికార్డును తన పేరిట నెలకొల్పింది.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది మిధాలి. ఈ క్రమంలో మరికొన్ని నెలల్లో సచిన్ రికార్డును మిధాలీ రాజ్ అధిగమించబోతోంది. మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 26 జూన్ 1999లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె క్రికెట్ ఆడుతూనే ఉంది. సచిన్ 22 సంవత్సరాల 91 రోజులు క్రికెట్‌లో కొనసాగగా, మిథాలీ 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడు నెలలు కనుక మిధాలీ రాజ్ క్రికెట్ ఆడితే సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలవడం ఖాయం. అదే జరిగితే అత్యంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన వ్యక్తిగా మిథాలీ రికార్డు నెలకొల్పనుంది.
ఇక 2022లో జరగనున్న మహిళల ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని మిథాలీ రాజ్ యేచిస్తోంది. దీన్ని బట్టి చూస్తే సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలవడం ఖాయమని చెప్పవచ్చు. టీ20లకు గుడ్‌బై చెప్పిన మిధాలీ, ప్రస్తుతం టెస్టులు, వన్డేలు మాత్రమే ఆడుతోంది. మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నా.. కప్పును మాత్రం సాధించలేకపోయింది. మిథాలీ ఖాతాలో ఇప్పటికే పలు రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు 214 వన్డేలు ఆడిన మిథాలీ ప్రపంచ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.