అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ యాషెస్ సిరీస్ లో మారోసారి తన స్టన్నింగ్ క్యాచ్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో రోజు ఆట కు అధ్భుత ఎండ్ కార్డ్ పడింది. శుక్రవారం ఆట ఆఖర్లో జో రూట్ బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ కొట్టిన భారీ షాట్ ను స్టోక్స్ కళ్లు చెదిరే రీతిలో ఒడిసి పట్టాడు. గతంలో ఎన్నో చక్కటి క్యాచ్ లు అందుకున్న స్టోక్స్.. బౌండ్రీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. వేగంగా పరుగులు చేయాలనే భావనతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ షాట్ కు యత్నించాడు. బంతి గీత దాటడం ఖాయమే అని అంతా భావిస్తున్న తరుణంలో.. లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే.. నియంత్రణ కోల్పోయిన స్టోక్స్.. గీత దాటేలా అనిపించడంతో బంతిని తిరిగి గాల్లోకి విసిరి బౌండ్రీ రోప్ దాటాడు. ఆ తర్వాత తీరికగా మైదానంలోకి వచ్చి క్యాచ్ ను పూర్తి చేశాడు.
ఈ సూపర్ ఫీల్డింగ్ విన్యాసంతో ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు. సాధారణంగా టీ20 క్రికెట్, ఫ్రాంచైజీ లీగ్ ల్లో మాత్రమే దర్శనమిచ్చే ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు స్టోక్స్ సంప్రదాయ క్రికెట్ లోనూ అమలు చేసి వారెవ్వా అనిపించుకున్నాడు. ఈ వీడియోను ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా స్టోక్స్ పట్టిన క్యాచ్ ను గుర్తు చేసిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
బాజ్ బాల్ ఆటతీరుతో తీవ్రంగా నష్టపోయి.. ఇప్పటికే యాషెస్ సిరీస్ ను కోల్పోయిన ఇంగ్లండ్.. చివరి మ్యాచ్ లో కంగారూలకు పోటీనిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న చివరిదైన ఐదో మ్యాచ్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులు చేయగా.. అనంతరం ఆసీస్ 295 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కంగారూలకు 12 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ లో ప్రస్తుతానికైతే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మరి స్టోక్స్ పక్షిలా ఎగురుతూ పట్టిన క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.