వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తోంది.
కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోతున్న కరీబియన్ జట్టు మీద ప్రధాన ఆటగాళ్లను బరిలోకి దింపాల్సిన అవసరం లేదని సీనియర్లు చివాట్లు పెట్టడంతో భారత మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నెగ్గి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లో పూర్తిగా యువ ఆటగాళ్లకే అవకాశం ఇచ్చింది. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చింది. దీంతో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. చాన్నాళ్లుగా బెంచ్‌కే పరిమితమవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కింది.
తొలి వన్డేలో స్వల్ప లక్ష్యఛేదనలో ప్రయోగాలకు తెరతీసిన టీమ్‌ఇండియా సీనియర్లకు బదులు యువ ఆటగాళ్లను తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చింది. అదే తీరు కొనసాగిస్తూ.. ఈ సారి రోహిత్, కోహ్లీకి రెస్ట్ ఇచ్చేసి యువ ఆటగాళ్లపైనే భారం వేసింది. వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ఇంకా మూడు నెలలు కూడా లేని నేపథ్యంలో మరి ఈ సువర్ణ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకునేవాళ్లేవరో నేడు తేలనుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష ఎదురయ్యే అవకాశాలున్నాయి. మొదట బ్యాటింగ్ చేయనున్న యంగ్‌ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి మరి.
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మరి పెద్ద తలకాయలు లేని బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరు యాంకర్ రోల్ పోషిస్తారు. మ్యాచ్‌ను ఎవరు ముగిస్తారు అనేది ఆసక్తికరం. మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. జట్టు కూర్పులో భాగంగా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న సంజూ శాంసన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి కనిపిస్తోంది. ఈ టూర్ ఆరంభానికి ముందు వరకు మూడు ఫార్మాట్లలో అన్‌డౌటెబుల్ ప్లేయర్‌గా కనిపించిన శుభ్‌మన్.. తాజాగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తొలి వన్డేలో అర్ధశతకంతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ అదే నిలకడగా కొనసాగిస్తే.. అతడి కెరీర్‌కు లాభదాయకం కానుంది. ఇక పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనాల నేపథ్యంలో భారత జట్టు మరో స్పిన్నర్‌ను జట్టులో చేర్చింది. అక్షర్ పటేల్ రాకతో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు మరింత బలం చేకూరినౖట్లెంది.