పోలీసులు అంటే నేడు ప్రజల్లో ఓ రకమైన భయమేర్పడింది. వారి పేరు చెబితేనే చాలు ఒంట్లో వణుకు పుడుతుంది. వీరి దగ్గరకు వెళితే.. డబ్బులు ఇవ్వందే పని జరగదని ఓ అపోహ ఉంది. కానీ ఏ ఒక్కరో చేస్తున్న పనికి పోలీసులంతా బాధితులయ్యారు. కానీ వీరిలో కూడా నిజాయితీగా డ్యూటీ చేసి శభాష్ అనిపించుకున్నవారున్నారు.
జాతీయ జెండా తర్వాత మనం గౌరవంతో సెల్యూట్ చేసేది దేశానికి, ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనికులు, పోలీసులకే. అయితే సైనికులపై ఉన్న గౌరవం పోలీసులకు దక్కడం లేదు. నేడు పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో ఓ రకమైన భయమేర్పడింది. వారి పేరు చెబితేనే చాలు ఒంట్లో వణుకు పుడుతుంది. స్వయంకృతాపరాధమో, లేదా వారి చర్యలతో బాధితులు కావడమో దీనికి కారణాల అవుతున్నాయి. అయితే ఈ పోలీసు వ్యవస్థలో అందరూ బాధ్యతారాహిత్యంగా ఉండరు. కొందరు ఖాకీ దుస్తులు వేసుకుని, ప్రజా సేవకే తమ జీవితాన్ని అంకింతం చేస్తారు. ప్రజలకు రక్షణగా ఉంటూ.. దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారిలో మహారాష్ట్రకు చెందిన అసిస్టెంట్ ఎస్సై కూడా ఒకరు.
ముంబయిలోని మాతుంగ పోలీస్‌స్టేషనులో బాబూరావు కృష్ణ కాంబే (58) అనే పోలీస్ అధికారి తన 36 ఏళ్ల సర్వీసులో మిస్సింగ్ కేసులు చేధించి ఉన్నతాధికారుల మన్నలను పొందారు. మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఆయన.. 165 మైనర్ మిస్సింగ్ కేసులను చేధించి శభాష్ అనిపించుకున్నారు. ఇటీవల 16 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. అయితే బాబూరావు వారం రోజుల్లోనే ఆ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. ఇది ఆయన 165వ కేసు. ఏ ప్రాంతంతో సంబంధం లేకుండా తప్పిపోయిన పిల్లలను వారి బంధువులతో తిరిగి కలపడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజా కేసులో బాలిక మొబైల్ ఫోను లేకపోవడంతో ఆమె ఆచూకీ లభించడం కష్టతరమైంది. అయినా వెనకడుగు వేయలేదు. బాలిక తల్లిదండ్రులు, స్నేహితులను విచారించగా.. గుజరాత్‌కు చెందిన ఓ అబ్బాయితో స్నేహం ఉన్నట్లు తేలింది.
తల్లిదండ్రులను విడిచి సూరత్‌లోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. తిరిగి ఆ యువతిని తీసుకు వచ్చిన కృష్ట కాంబే.. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన, పారిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉందని చెప్పారు కృష్ట కాంబే. తన ఫస్ట్ కేసును కూడా గుర్తు చేసుకున్న ఆయన. రాక్ మార్గ్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ పిల్లవాడు తప్పిపోయిన కేసు రాగా, నెలల తరబడి వెతికినా దొరకలేదట. భివాండీలోని పిల్లల వసతి గృహంలో బాలుడ్ని గుర్తించామని, ఓ వర్షం రాత్రి తల్లి వద్దకు బిడ్డను తీసుకెళ్లామన్నారు. కానీ అతడు తల్లిని గుర్తుపట్టలేదట. తల్లి గొంతు విన్నాక, పరుగెత్తుకుంటూ తన చేతుల నుండి అమ్మ వద్దకు చేరాడంటూ చెప్పారు అధికారి.