హైదరాబాద్ క్రైం- ఈ సమాజంలో కాస్త కలివిడిగా ఉంటే విచ్చల విడితనం అంటారు.. అదే సైలెెంట్ గా ఉంటే లోకజ్ఞానం లేదంటారు.. మరి ఏంచేయమంటారు.. ఏంటి ఇదేదో అతడు సినిమాలో డైలాగ్ లా ఉందా. కాదండీ బాబు.. ఇప్పుడు ఎలా ఉన్నా కష్టమేనని చెప్పడమే ఇందులో అసలు విషయం. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తాను పనిచేసే ఆఫీస్ లో తనతో ఆమె క్లోజ్‌గా ఉంటోందని అపార్థం చేసుకున్నాడో కొలిగ్. ఇంకేముంది తనంటే ఆమెకు ఇష్టమేనని ఫిక్స్ అయిపోయాడతను. అంతే ఇక ప్రొసీడ్ అవుదాం అనుకున్నాక ఆమె నో చెప్పడంతో తనకు దక్కలేదని ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె పరువు తీయాలని దుర్మార్గపు ఆలోచన చేశాడు. ఆమె ఫొటోలను అసభ్యకరంగా తయారుచేసి అల్లరిపాలు చేయాలని పధకం రచించాడు. కానీ అతడి ప్లాన్ ను పసిగట్టిన ఆమె వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించింది.
అసలేం జరిగిందంటే.. నల్లగొండ జిల్లాకు చెందిన 27 ఏళ్ల దిలీప్ కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో తనతో పాటు మరో యువతి కూడా వర్క్ చేస్తోంది. తన సంస్థలోనే పనిచేస్తున్నాడని అతనితో ఆమె కాస్త క్లోజ్ గా ఉండేది. అదిగో అదే ఆమె చేసిన తప్పు. ఆమె తనతో సన్నిహితంగా ఉంటోందని అపార్థం చేసుకున్న దీలీప్ ఆమెకు ఐలవ్ యు చెప్పాడు. తనకు ఇష్టం లేదని ఆమె మొహం మీదే చెప్పేసింది. అయినా దిలీప్ ఆమె వెంట పడేవాడు. దీంతో ఆమె చేసేది లేక ఆమె ఏకంగా ఉద్యోగం మానేసింది.
తన ప్రేమను కాదన్నందుకు ఆమెపై దిలీప్ పగను పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె పరువు తీయాలని ఉన్మాదిగా ఆలోచించాడు. తన దొంగ తెలివితేటలతో ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేశాడు. ఆమె ఫొటోలను డౌన్ లోడ్ చేసుకుని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వేధించడం ప్రారంభించాడు. అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న ఆమె రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు.