ఇంటర్నేషనల్ డెస్క్- వర్షాకాలం మొదలైంది. ఇక ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఉహించలేము. వర్షాకాలంలో రోడ్లపై వాహనాల్లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. ఎందుకంటే వాననీటికి వెహికిల్స్ స్కిడ్ అవుతుంటాయి. అంతే కాదు వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తుంటాయి. అందుకే వర్షంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదంటారు.
ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కురిసే వానలో బయట తిరగడం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల షెడ్ల కింద తలదాచుకోవడం ప్రమాదకరం. అంతే కాదు వానలు కురిసే సమయంలో రోడ్లపై ప్రయాణించే వాహనాలపై కూడా పిడుగులు పడే అవకాశాలు ఉంటాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అమెరికాలోని కాన్సాస్‌లోని వేవర్లీలో ఐదుగురు కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారు. భారీగా వర్షం కురుస్తుండటంతో కారును ఓ పక్కకు ఆపారు. కాసేపటికి ఓ పెద్ద పిడుగు కారు మీద పడింది. అంతే ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. పిడుగుపాటుకు కారులోని వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.
అదూృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమి జరగలేదు. పిడుగు వల్ల కారు ఇంజిన్ మాత్రం పాడైపోయింది. తమకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి కారుపై పిడుగు పడ్డా ఏంకాలేదని ఊపిరి పీల్చుకున్నారు వాళ్లంతా. ఈ పిగుపాటు ఘటన ఆ కారు వెనుక వస్తున్న మరో కారు డ్యాష్ బోర్డ్ కెమేరాలో రికార్డయ్యింది. కారు మీద పిడుగు పడుతున్న వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.