హైదరాబాద్- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు తర్జన భర్జన పడుతున్నారు. కర్నూలులో చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైన నేపధ్యంలో పోలీసులు హైదరాబాద్ వచ్చారు. కర్నూలులో ఎన్ 440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అంతే కాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 54 కింద నాన్ బెయిల్ సెక్షన్లను నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటంతో కర్నూలు నుంచి ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చింది.
కానీ ఇంతవరకు చంద్రబాబుకు నోటీసులు మాత్రం ఇవ్వలేదు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. నోటీసుల్లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు వివరాలతో పాటు, విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసుల ఆదేశాలు ఉండనున్నాయని చెబుతున్నారు. మరి పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇస్తారా.. ఇస్తే ఆయన ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక.. ముందు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారని.. అంత మాత్రాన ఆయనపై కేసు పెడతారా అని టీడీపీ నేతలు జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.