ఇంటర్నేషనల్ డెస్క్- అగ్ర రాజ్యం అమెరికా చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా చరిత్రలో ఓ మహిళ అధ్యక్షురాలిగా పదవీ భాద్యతలు స్వీరించడం ఇదే మొదటిసారి. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ భాద్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు తాత్కాలికంగా బదిలీ చేశారు. అధ్యక్షుడు బైడెన్ కు వైద్య పరీక్షల నేపథ్యంలో, తన బాధ్యతలను బైడెన్ తాత్కాలికంగా కమలాకు అప్పగించారు. బైడెన్ కు పెద్ద పేగుకు సంబంధించి ప్రతి సంవత్సరం కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు అనస్థీషియా ఇస్తారు. జో బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే మొదటిసారి.
ఈ నేపధ్యంలో కమలా హ్యారిస్ కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొట్ట మొదటి మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. అంతకు ముందు అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగానూ కమలా హ్యారిస్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికా రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి ప్రెసిడెంట్ జో బైడెన్ అనస్థీసియాలో ఉన్న కొద్ది కాలం పాటు ఉపాధ్యక్షురాలికి అధికారాన్ని బదిలీ చేస్తారని వైట్ హౌస్ మీడియా ప్రతినిధి జెన్ సాకీ ఓ ప్రకటనలో తెలిపారు.
మొత్తం ఒక గంట 25 నిమిషాల పాటు కమలా హ్యారిస్ ఆమెరికా అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.10 గంటలకు అమెరికా అధ్యక్ష్య అధికారాలను జో బైడెన్ నుంచి కమలా హ్యారిస్ కు బదిలీ చేయనున్నట్టు వైట్ హౌస్ తెలిపింది. ఉదయం 10.10 గంటల నుంచి 11.35 గంటల వరకు అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్ నిర్వహిస్తారని పేర్కొంటూ కాంగ్రెస్ కు అధికారికంగా లేఖను పంపింది. జో బైడెన్ తిరిగి ఉదయం 11.35 గంటలకు అమెరికా అధ్యక్ష్య బాధ్యతలను చేపడతారని ఆ లేఖలో వైట్ హౌజ్ పేర్కొంది.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు. అన్నట్లు జో బైడెన్ ఈ శనివారం 79వ ఏట అడుగుపెట్టారు. కాసేపు అయినప్పటికీ అమెరికా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.