ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికలు ఎంత ఉత్కంఠను రేపాయో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తిని రేపుతున్నాయి. గతంలో మా ఎన్నికల సందర్బంగా నరేష్ ప్యానెల్, శివాజీ రాజా ప్యానెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వివాదాస్పమయ్యింది. ఈ సారి కూడా మా ఎన్నికలు అదే రేంజ్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు రేసులో ఉన్నారు.
ఐతే ఇప్పుడు మా ఎన్నికల బరిలోకి జీవితా రాజశేఖర్ ఎంటరవ్వడంతో మరింత ఆసక్తికరంగా మారింది. జీవిత రాజశేఖర్ ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అండుతో ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న నరేష్ మద్దతు మంచు విష్ణుకు ఉందట. ఇక ఇప్పుడు జీవితా రాజశేఖర్ ‘మా’ ఎన్నికల బరిలో దిగుతుందని తెలియడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ నుంచి జీవిత రాజశేఖర్ పోటీ చేశారు. ఐతే ఆ తర్వాత నరేశ్ తో విభేదాలు రావడంతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడంతో ఒకరిపై ఆరోపణలు గుప్పించడం, రాజశేఖర్ తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ‘మా’ ఎన్నికల్లో మల్లీ జీవిత రాజశేఖర్ పోటీ చేస్తారని, అది కూడా ‘మా’ అధ్యక్ష్య పదవికి పోటీ చేయబోతున్నారని తెలిసి ఏంజరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.