నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీకి చెందిన రెండు దగ్గు మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. ఉజ్బెకిస్తాన్ లోని చిన్నారులకు వాడొద్దని ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఉజ్బెకిస్తాన్ లో మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు ప్రాణాలు కొల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
చిన్నారుల మరణం తర్వాత ఉజ్బెకిస్థాన్ లోని నేషనల్ క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీస్ నాణ్యత పరీక్ష చేపట్టిందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ, మరియన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు అంబ్రోనాల్, డాక్-1 మాక్స్ లలో పరిమితికి మించి డై ఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నాయని పేర్కొంది. ఈ మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని .. భద్రతలకు సంబంధించి మరియన్ బయోటెక్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని వెల్లడించింది. ”ఈ నాసిరకం ఉత్పత్తులు సురక్షితం కాదు. వాటిని ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పిల్లలలో, తీవ్రమైన అనారోగ్య లేదా మరణానికి దారితీయవచ్చు” అని డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, గత నెలలో ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన మందులను వాడటం వల్ల తమ దేశంలో 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది’. వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో దీనిని తీసుకోవడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ 2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టరు చేయించుకుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో మరియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది. కాగా, కొన్ని నెలల క్రితం కూడా ఈ తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా పనిచేసే ‘మైడెన్ ఫార్మా’ కంపెనీ ఉత్పత్తిచేసిన సిరప్‌లు వినియోగించి గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ కంపెనీ మందులపై కూడా WHO నాలుగు నెలల క్రితం హెచ్చరికలు జారీ చేసింది. పిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ మందులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపమ్లో తెలియజేయండి.
WHO Advises Not To Use 2 Marion Biotech Cough Syrups In Uzbekistanhttps://t.co/FmoxR6Ay6E pic.twitter.com/z1URhionGK
— medicarenews (@medicarenewsrtk) January 12, 2023