భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి లండన్‌లోని రిజెంట్ పార్క్‌లో తన సొంత ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మాల్యా నివాసముంటున్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు స్విస్ బ్యాంక్ అయిన “యూబీఎస్” కు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా.. మాల్యాతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఇంటినుంచి బహిష్కరించాలని లండన్ కోర్టు ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో ఈ తీర్పునిచ్చింది.
లండన్ లో విజయ్ మాల్యా నివాసం ఉండే “18/19” కార్నవాల్ టెరాస్ అనే అపార్ట్ మెంట్ లక్షల పౌండ్ల విలువ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఇంట్లో మాల్యా, అతని తల్లి లలిత, కొడుకు సిద్ధార్థ ఉంటున్నారు. గతంలో మాల్యాకు చెందిన రోజ్ క్యాపిటల్స్ సంస్థ.. ఈ ఇంటిని తనకా పెట్టి యూబీఎస్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. దీన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో స్విస్ బ్యాంక్ లండన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో.. 2020 ఏప్రిల్ 30 లోగా రుణాన్ని తిరిగి చెల్లించాలని 2019మేలో కోర్టు ఆదేశించి. అయితే ఈ గడువులోగా రుణాన్ని మాల్యా చెల్లించలేదు. ఈలోగా కోవిడ్-19 నిబంధనల వల్ల కోర్టు తీర్పు అమలుకు న్యాయపరంగా స్విస్ బ్యాంక్ చర్యలు తీసుకోలేకపోయింది.
ఇది చదవండి : యుద్ధనౌక INS రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు సిబ్బంది మృతి
చివరికి గతేడాది అక్టోబర్ లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలు చేయాలని యూబీఎస్ బ్యాంక్ లండన్ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిపిన విచారణలో కోర్టు కీలక సూచనలు చేసింది. నోటీసులు అందాక కుటుంబం స్వతహాగా ఖాళీ చేయకుంటే.. ఇంటి నుంచి పంపేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇది చదవండి : నాలుగు చేతులు, నాలుగు కాళ్ళతో వింత శిశువు జననం..!
బ్యాంక్ ప్రొసీడింగ్స్ లో ఎటువంటి ఆలస్యం జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది. తీర్పు వాయిదా వేయాలన్న మాల్యా వేసిన పిటిషన్ ను సైతం లండన్ హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే సరిపడా సమయం ఇచ్చామని ఈ విషయంలో వేరే నిర్ణయం ఇస్తారని అనుకోవడం లేదని తెలిపారు. అయితే తీర్పు అనంతరం స్విస్ బ్యాంకు ఇంటిని స్వాధీనం చేసుకోనుందని తెలుస్తోంది. లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు తగిలిన ఎదురు దెబ్బపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.