అవును మీరు చదివింది నిజమే.. ఓ పిల్లి ఆస్తి విలువ అక్షరాలా 800 కోట్ల రూపాయలు. ఇంత ఆస్తి ఉంది కదా ఈ పిల్లి ఏమైనా స్వర్గంనుంచి దిగివచ్చిందా? అన్న వ్యంగ్య ప్రశ్న తలెత్తక మానదు. ఈ పిల్లి మిగితా పిల్లుల కంటే ప్రత్యేకమైనదేమీ కాదు. కానీ, దాన్ని పెంచుకునే ఓనర్ గొప్పతనం కారణంగా ఈ పిల్లికి మహర్థశ పట్టింది. ఆనతి కాలంలో అంత పెద్ద మొత్తం డబ్బు సంపాదించింది. ఇప్పటికి కూడా సంపాదిస్తూనే ఉంది. ఆ ఓనర్ ఎవరు? ఆ పిల్లి కథ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి తెలియని వారు ఉండరు.
ఆమె తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఈమె ఒలివియా బెన్సన్ అనే పిల్లిని పెంచుకుంటోంది. చూడటానికి బొద్దుగా ఉండే ఈ పిల్లి ఇప్పుడు 97 మిలియన్ డాలర్లకు ఓనర్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 కోట్ల రూపాయలు. ఈ పిల్లి ప్రపంచంలోనే అత్యధిక ఆస్తి కలిగిన పెంపుడు జంతువుల్లో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంతకు ఈ పిల్లి అంత పెద్ద మొత్తం ఎలా సంపాదించిందంటే.. టేలర్ స్విఫ్ట్ పిల్లి మీద పెట్టే పోస్టుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వస్తోంది. అలా ఆ పిల్లి కోట్లకు పడగలెత్తింది.
ఓ సంస్థ ఇన్స్టాగ్రామ్ అనలిటిక్స్ ఆధారంగా కొన్ని జంతువుల సంపాదనను లెక్క గట్టింది. ప్రపంచంలో అత్యధిక ఆస్తులు కలిగిన జంతువుల లిస్ట్‌ను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో 500 మిలియన్ డాలర్లతో ఓ జెర్మన్ షెపర్డ్ కుక్క మొదటి ప్లేస్‌లో ఉంది. రెండో స్థానంలో 100 మిలియన్ డాలర్ల ఆస్తితో నాలా అనే పిల్లి నిలిచింది. మూడో స్థానంలో టేలర్ పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్ ఉంది. మరి, తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తూ మనుషుల మతి పోగొడుతున్న ఈ జంతువులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.