Woman Marries Cat: ‘‘మేకను పెళ్లి చేసుకున్న యువకుడు’’.. ‘‘ చెట్టును వివాహం చేసుకున్న హీరోయిన్’’ అన్న వార్తలు చదివే ఉంటారు. దేశంలో ఇలాంటి పెళ్లిళ్లు కొత్తేమీ కాదు.. వింతేమీ కాదు. సాధారణంగా జాతకంలో ఏదైనా దోషం ఉండి.. పెళ్లి జరగటం లేదంటే ఇలా చేస్తూ ఉంటారు. దోషం ఉన్నవాళ్లకు చెట్టుతోనో.. లేదా ఏదైనా జంతువుతోనో పెళ్లి చేస్తారు. ఆ పెళ్లితో దోషం తీరిపోయిందని భావిస్తారు. ఆ తర్వాత నిజమైన పెళ్లి చేస్తారు. అత్యవసరం అనుకుంటే తప్ప ఇలాంటి దోష నివారణ పెళ్లిళ్లు జరగవు. అలాంటిది ఓ మహిళ తన పెంపుడు జంతువుకు దూరం కాకుండా ఉండటానికి ఏకంగా దాన్నే పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది.
ఇంతకీ సంగతేంటంటే.. ఇంగ్లాండ్, లండన్‌లోని సిడ్‌కప్‌కు చెందిన డెబోరా హొడ్గే అనే 40 ఏళ్ల మహిళ తన పిల్లలు, రెండు కుక్కలతో పాటు ‘ఇండియా’ అనే ఓ పిల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఆ జంతువులు తమ ఇంట్లో ఉండటం ఇష్టం లేని ఇంటి యజమానులు వాటిని దూరంగా వదిలేయమని ఆమెకు చెప్పారు. అయితే, ఆమె దానికి ఒప్పుకోలేదు. దీంతో ఇంటిని ఖాళీ చేయమని అన్నారు. అలా, పెంపుడు జంతువుల కారణంగా చాలా ఇళ్లు మారింది. ఈ నేపథ్యంలో డెబోరా తనకు ఎంతో ఇష్టమైన ఇండియాని వదులు కోకూడదని అనుకుంది. ఇందుకోసం ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. పిల్లితో పెళ్లికి సిద్ధమైంది. కొద్దిరోజుల క్రితం పార్కులో పిల్లిని పెళ్లి చేసుకుంది. దీనిపై డెబోరా మాట్లాడుతూ.. ‘‘ నా పిల్లికి దూరం కాకూడదన్న ఒకే ఒక్క కారణంతో దాన్ని పెళ్లి చేసుకున్నాను.
దీనిపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ పెళ్లి ద్వారా నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. నేను ఇష్టపడే జంతువును నేను వదులుకోను. నేను ఇండియా లేకుండా బతకలేను. అది ఎంతో స్నేహంగా ఉంటుంది. నా పిల్లల తర్వాత ‘ఇండియా’కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇళ్లు లేకపోతే రోడ్ల మీద బతుకుతానేమోకానీ, ఇండియా లేకపోతే ఉండలేను’’ అని అంటోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది డెబోరాను సపోర్టు చేస్తూ మాట్లాడుతుంటే.. మరికొంతమంది ఆమె చేసింది తలతిక్క పనంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విచిత్ర పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గిన్నిస్ రికార్డుకెక్కిన 119 ఏళ్ల బామ్మ కన్నుమూత!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.