వైరస్ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు టీకాకు లొంగని పరిస్ధితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం తిరిగి వ్యాధి బారిన పడుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. సింగిల్ డోస్ టీకా లేదా రెండు డోసుల టీకా తీసుకున్నాక 6 నెలల సమయం దాటి ఉన్నవారు బూస్టర్ షాట్ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బూస్టర్ షాట్ అంటే ఇంకో డోసు టీకా. దీనివల్ల కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. కోవిడ్ టీకా పూర్తి స్థాయిలో డోసు తీసుకున్న తరువాత కూడా కొందరికి రోగ నిరోధక శక్తి ఉండడం లేదు. పైగా డెల్టా వేరియెంట్ కూడా వ్యాప్తి చెందుతోంది. అందువల్లే బూస్టర్ డోస్ తీసుకోమని చెబుతున్నారు. రెండో డోస్ ప్రభావం ఐదారు నెలల్లో తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కరోనా వేరియంట్లు తయారువుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడానికి బూస్టర్ డోసు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే కొన్ని దేశాలు టీకా పూర్తి డోసు తీసుకుని 6 నెలలు గడుస్తున్న వారికి బూస్టర్ షాట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీర్ఘకాలంగా రోగాలతో బాధ పడుతున్న వారికి కూడా బూస్టర్ డోసు అవసరం ఎంతైనా ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే దీర్ఘకాల రోగులకు బూస్టర్ డోసులు ఇవ్వాలని నిపుణులు సిఫార్సు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా క్యాన్సర్, హెచ్‌ఐవీ, లుకేమియా, కీళ్లవాతంతో బాధపడుతున్నవారికి, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రస్తుతం పుట్టుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్లను సైతం ఎదుర్కొనేలా ఈ బూస్టర్ డోసు సమర్ధవంతంగా తయారు చేస్తారు.
ఇక భారత్‌లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీకాల మిశ్రమం, బూస్టర్ డోసుల విషయంలో ప్రపంచ దేశాల అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.