భార్యల మాటలు వినని భర్తల పని పట్టేలా యాప్ వచ్చింది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మాట వినని భర్త కూడా వినాల్సిందే. ఇంటి పనులతో సతమతమవుతున్న మహిళల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకొచ్చింది.
మగాడిదేముంది 8 గంటలు ఆఫీసులో, రెండు గంటలు ట్రాఫిక్ లో ఉంటాడు. మిగతా సమయం ఇంట్లో కాలు మీద కాలేసుకుని టీవీ చూస్తాడు. కానీ ఆడవాళ్లు అలా కాదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ మర మనిషిలా పని చేస్తూనే ఉంటారు. మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుంటారనుకోండి. కానీ కంటిన్యూగా రెండు, మూడు గంటలకి చేస్తే తేలే పని కాదు. ఇంటి పని, వంట పని, బట్టలుతకడం, అంట్లు తోమడం, పిల్లల్ని తయారు చేయడం ఇలా చాలా పనులతో సతమతమవుతారు. పిల్లల ముడ్డి కడగమని ఏ భర్తనో అడిగితే.. ‘వాట్ చంటి గాడి ముడ్డి నేను కడగాలా? ఇట్స్ ఏ లేడీస్ జాబ్’ అని ఒక డవిలాగ్ వేస్తారు.
ఇలా ఇల్లాలు ఇంటి పనిలో సాయం చేయమంటే.. మేము బయట బోలెడంత పని చేస్తున్నాము, ఆఫీసులో తెగ పని చేస్తున్నాము అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు భర్తలు. ఇక ఇంటి పనులు చక్కబెడుతూ, ఉద్యోగం చేసే భార్యలకైతే నరకమే. ఇలాంటి భార్యలకు ఇంటి పనిలో సహాయం చేయాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. లంకంత కొంపలో చాకిరీ చేసి చేసి అలసిపోతున్నామని, ఇల్లు, పిల్లలు, ఆఫీస్ ఇలా ఊపిరి సలపనంత పనులతో సతమతమవుతున్నామని మహిళలు బాధపడుతున్నారు. భర్తలు కూడా ఇంటి పని, వంట పని, పిల్లల స్కూల్ బాధ్యతలను చూసుకుంటే బాగుంటుందని, కానీ ఇది కలగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా స్పెయిన్ ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకొచ్చింది.
ఇంటి పని, వంట పనిలో భర్త సహాయం చేస్తున్నారా? లేదా? అని పరీక్షించే యాప్ ని ప్రత్యేకంగా రూపొందించింది. జెనీవాలో జరిగిన సమావేశంలో స్పెయిన్ విదేశాంగ కార్యదర్శి, లింగ సమానత్వ, గృహ హింస మంత్రి ఏంజిలా రోడ్రిగ్జ్ ఉచితంగా ఒక యాప్ ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. కంటికి కనిపించని మహిళల మానసిక భారాన్ని తగ్గించడం, వారి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ యాప్ ని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
మహిళలకు ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరమని, ఈ యాప్ ద్వారా ఇంటి పనులను సమానంగా పంచుకునే వీలు ఉంటుందని అన్నారు. భార్య, భర్తలు ఇద్దరిలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు? ఎవరు తక్కువ పని చేస్తున్నారనే విషయాన్ని ఈ కొత్త యాప్ కనిపెడుతుందని అన్నారు. భర్తలు తక్కువ పని చేసినా, భార్యలకు ఇంటి పనుల్లో సహకరించకపోయినా చర్యలు తీసుకునేలా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఇలాంటి యాప్ భారత్ లో అమలు చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.