బాల్యంలో ఉన్నప్పుడు చాలా మంది గాలిపటాలు ఎగురవేసి ఉంటారు. సంక్రాంతి పండుగప్పుడో, లేక వేరే ఇతర సందర్భాల్లో చిన్నపిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పెద్దవారు కూడా ఎగురవేస్తుంటారు. అయితే ఇదే గాలిపటాల కాన్సెప్ట్ తో కరెంటుని తయారు చేసేందుకు శాత్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇంకా దీనిపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఒక గాలిపటాన్ని ఎగురవేయడం ద్వారా 10 కుటుంబాలకు సరిపడా విద్యుత్ ను తయారు చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వనరులు వాడే కొద్దీ తరిగిపోతుంటాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు వనరులను ఉత్పత్తి చేసేందుకు కొత్త కొత్త పద్ధతులను ఆవిష్కరిస్తుంటారు. విద్యుత్ తయారీకి వాడే బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా సోలార్ ఎనర్జీని కనిపెట్టారు. ఇప్పుడు చాలా ఇళ్లలో సోలార్ కరెంటునే వాడుతున్నారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో సోలార్ విద్యుత్, సోలార్ పంపులు వాడుతున్నారు. అయితే గాలిపటాల ద్వారా కూడా విద్యుత్ ని తయారు చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఇదో మార్గమని అంటున్నారు. ఇప్పటికే గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. భూమి నుంచి 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన గాలి మరల ద్వారా పవన విద్యుత్ ను తయారు చేస్తున్నారు.
అయితే భూమి నుంచి 200 మీటర్ల ఎత్తులో గాలులు మరింత స్థిరంగా, బలంగా వీస్తాయని.. ఆ గాలుల ద్వారా ఇంకా ఎక్కువ విద్యుత్ ను సృష్టించవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పవన విద్యుత్ కంటే ఎనిమిది రెట్లు అధిక విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. దీని కోసం గాలిపటాలను వాడనున్నారు. చూడ్డానికి సంక్రాంతికి ఎగురవేసే గాలిపటాల్లానే ఉంటాయి. కానీ భారీ సైజులో ఉంటాయి. వీటిని పవర్ కైట్స్ అంటారు. నెదర్లాండ్స్ డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు 10 చదరపు మీటర్ల గాలిపటాన్ని ఒక జనరేటర్ కు అనుసంధానం చేసి గాల్లో ఎగురవేశారు. ఆ గాలి ద్వారా 10 కిలోవాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. ఈ విద్యుత్ పది కుటుంబాలకు సరిపోతుందని.. నిరంతరం వస్తూనే ఉంటుందని అంటున్నారు. ఈ గాలిపటాలను మును ముందు 50, 100 కిలోవాట్లకు పెంచి లక్ష ఇళ్ళకు విద్యుత్ అందించాలనేది తమ లక్ష్యమని అన్నారు.
ఈ ప్రయోగానికి లాడర్ మిల్ అనే పేరు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన కంపెనీలు, స్టార్టప్ లు గాలిపటాల ద్వారా విద్యుత్ ను తయారు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరి కొన్నేళ్లు పట్టవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్ ఈ స్థాయికి రావడానికి 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు గాలిపటాల ద్వారా విద్యుత్ ను తయారు చేయాలంటే కొన్నేళ్లు పడుతుందని ఫ్రీబర్గ్ యూనివర్సిటీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పరిశోధకులు రిషికేష్ జోషి వెల్లడించారు. అయితే ఈ ప్రయోగాలు ప్రస్తుతం ఉన్న పవన విద్యుత్ కి అదనమే తప్ప ప్రత్యామ్నాయం కాదని అన్నారు. మరి గాలిపటాలతో విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్న శాస్త్రవేత్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.