కొందరు పాకిస్తానీ నటీమణులు, మోడల్స్ హనీ ట్రాప్‌కు పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్‌కు చెందిన రిటైడ్ మిలిటరీ ఆఫీసర్ ఆదిల్ రజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తనపై హనీ ట్రాప్ ఆరోపణలు రావటంపై ప్రముఖ పాకిస్తానీ నటి సజల్ అలీ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో .. ‘‘ మన దేశం విలువల పరంగా అణగారిపోతోంది. ఒకరి వ్యక్తిత్వాన్ని నాశనం చేయటమే దారుణమైన మానవత్వంగా..శాపంగా మారిపోయింది’’ అని అన్నారు.
మరో నటి కుబ్ర ఖాన్ కూడా ఆదిల్ రజాపై మండిపడ్డారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ స్టోరీ పెట్టారు. ‘‘ ఓ ఫేక్ వీడియో వల్ల నా ఉనికికి ఏ మాత్రం భంగం కలగదని నేను మొదట్లో భావించాను. కానీ, ఇక చాలు.. నాపై అనవసరమైన కామెంట్లు చేస్తే నేను ఊరుకుంటానని అనుకుంటున్నారా?. ఆదిల్ రజా మీరు ఎవరి మీదైనా కామెంట్లు చేసే ముందు ఆధారాలను చూపండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ ఏం జరిగింది ?
పాకిస్తాన్‌కు చెందిన మేజర్ ఆదిల్ రజా పాకిస్తాన్ మిలటరీలో పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘‘సోల్జర్ స్పీక్స్’’ అనే ఓ యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నారు. దానికి మూడు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆదిల్ రజా మిలటరీ గురించి తరచుగా వీడియోలు చేసి అందులో పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం హనీ ట్రాప్ గురించి ఓ వీడియో చేశారు. పాకిస్తాన్‌కు చెందిన పలువురు నటీమణులు, మోడల్స్ హనీ ట్రాప్‌కు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వారి పూర్తి పేర్లు చెప్పకుండా ఎమ్‌హెచ్, ఎమ్‌కే, కేకే, ఎస్‌ఏ అని అన్నారు. వీరంతా మిలటరీ జనరల్ బజ్వాతో పాటు ఐఎస్‌ఐ హెడ్ ఫైజ్ హమీద్‌తో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
సదరు నటీమణులు పొలిటీషియన్లపై హనీ ట్రాప్‌కు పాల్పడుతున్నారని కూడా అన్నారు. నెటిజన్లు అతడు చెప్పిన నటీమణులు మెహ్‌విష్ హయాత్, మహిరా ఖాన్, కుబ్రా ఖాన్, సజల్ అలీ అని డిసైడ్ అయిపోయారు. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో రచ్చ మొదలైంది. మరి, పాకిస్తానీ నటీమణులు, మోడల్స్ హనీ ట్రాప్‌కు పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్‌కు చెందిన రిటైడ్ మిలిటరీ ఆఫీసర్ ఆదిల్ రజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.