చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. అన్ని దేశాలు ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. ఓ వైపు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు చాలా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల్లో టీకాలు ఇవ్వడం ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ సారికొత్త వేరియెంట్స్ తో ప్రపంచ దేశాలను కలవర పెడుతూనే ఉంది. కరోనా వైరస్‌లో వేరియంట్లకు అడ్డుకట్ట పడడం లేదు. మాయదారి వైరస్ రోజుకో రకంగా రూపాంతరం చెందుతూ ప్రజలను పీడిస్తోంది. తాజాగా రష్యాలోని మాస్కోలో మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది.
ఇది మాస్కోలో బయటపడడంతో దీనిని మాస్కో వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ మేరకు రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా ఈ రకం బయటపడింది. ఆ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ టీకా ‘మాస్కో వేరియంట్’పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందన్న దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు ‘గమలేయ’ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై వ్యాక్సిన్ పనిచేస్తుందనే విశ్వసిస్తున్నట్టు చెప్పారు. కాగా, రష్యాలో నిన్న 13,397 కేసులు వెలుగుచూడగా, అందులో ఒక్క మాస్కోలోనే 5,782 కేసులు నమోదు కావడం గమనార్హం.