మనషుల్లో కొందరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. అడగకుండానే ఆర్థిక సాయం చేస్తారు. మళ్లీ డబ్బులు తిరిగి చెల్లించమంటారు. ఇలా ఇద్దరి మధ్య జరిగిన పంచాయితీ చివరికి కోర్టుల వరకు వెళ్తుంది. అచ్చం ఈ తరహ ఘటన ఒకటి బ్రిటన్ లో జరిగింది. వీధులు ఊడ్చే వ్యక్తికి ఓ ధనవంతుడు ఏకంగా రూ.1.9 కోట్లు ఇచ్చాడు. అప్పటికి వదిలేసి దాదాపు 10 ఏళ్ల తర్వాత తన డబ్బులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. కోర్టులో కేసు గెలిచి తన సొమ్మును తిరిగి తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ నిరుపేద వ్యక్తికి అతడు అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
బ్రిటన్‌కు చెందిన జాన్ రాంకిన్ కార్న్‌ఫోర్త్ అనే ఓ ధనవంతుడు.. 1979లో ఓ న్యూఇయర్ పార్టీలో సిమోన్ డెనియర్ అనే పేదవాడిని కలిశాడు. డెనియర్ వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరు కలిసి పలు మార్లు మద్యం సేవించేవారు. ఇలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. తన తండ్రి మరణానంతరం కొన్ని మిలియన్లు పౌండ్లు జాన్ రాంకిన్ పొందాడు. అందులోంచి సుమారు 2 లక్షల పౌండ్లు తన నిరుపేద మిత్రుడు డెనియర్ కు 2012 నుంచి2014 మధ్య పలుమార్లు ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో సడెన్ గా తన సొమ్ము తిరిగి చెల్లించాలని జాన్ రాంకిన్ అడిగాడు. ఎన్ని రోజులైన తన సొమ్మును తిరిగి చెల్లించకపోవటంతో కోర్టు మెట్లు ఎక్కారు జాన్ రాంకిన్.
తన స్నేహితుడు ఆర్ధికంగా ఎదిగిన తరువాత తిరిగి చెల్లిస్తాడని భావించానని జాన్ తెలిపారుడ. కానీ అలా జరగలేదన్నారు. అందుకే కోర్టు సాయం కోరినట్టు తెలిపాడు. మరోవైపు.. ఇంటి రుణం తీర్చేందుకని ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చాడని డెనియర్ కోర్టుకు తెలిపాడు.”వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగించే డెనియర్‌కు అది పెద్ద మొత్తం. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు” అని డెనియర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి.. స్నేహితుడి దగ్గర ఇంటి కోసం తీసుకున్నదంతా, తిరిగి చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చారు. కానుకగా ఇచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి రుణంతో పాటు దానికి వడ్డీ చెల్లించాలని, అయితే.. విడాకుల కోసం ఇచ్చిన వాటికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.