ఈ సృష్టిలో కల్తీ లేకుండా ఏదైనా దొరకుతుందా అంటే అది తల్లిపాలే అని చెప్పవచ్చు. అంతటి శ్రేష్టమైన చనుబాలను పాల బ్యాంకుకు విరాళంగా ఇచ్చి ఎంతో మంది శిశువుల ఆకలి తీర్చింది ఓ మాతృమూర్తి.
ప్రత్యక్ష దైవం అమ్మ. సృష్టికి మూలం అమ్మ. తన గర్భగుడి మానవ చిరునామాకు నిదర్శనం. నవమాసాలు బిడ్డను తన గర్భంలో మోసి, పురిటి నొప్పుల బాధను భరించి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. చనుబాలతో అనురాగం పంచి ప్రేమతో లాలిస్తుంది. బిడ్డల ఎదుగుదలకు ఎంతో శ్రమిస్తుంది. వారికి ఏ ఆపద వచ్చినా తల్లడిల్లిపోతుంది అమ్మ. కనుక తల్లికి ఎంత సేవ చేసినా అమ్మ రుణం తీర్చలేము, అమ్మ ప్రేమకు వెలకట్టలేము. తాను తినకున్నా బిడ్డల ఆకలి తీర్చే మాతృమూర్తి అమ్మ. ఈ క్రమంలో ఓ తల్లి చనుబాలకు నోచుకోని ఎందరో బిడ్డలకు పాలు అందించింది. పసిబిడ్డల ఆకలి తీర్చి గొప్ప మనసు చాటుకుంది. 1600 లీటర్ల చనుబాలను దానం చేసి గిన్నీస్ రికార్డ్ సాధించింది. దీంతో ప్రపంచమంతా ఆ తల్లికి పాదాభివందనాలు తెలుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయి. శిశివు ఆరోగ్యంగా ఎదిగేందుకు చనుబాలు ఎతో శ్రేష్టమైనవి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న చనుబాలు కొందరు శిశువులకు అందడం లేదు. పసిబిడ్డలు వివిధ కారణాలతో తల్లి పాలకు దూరమవుతున్నారు. బిడ్డల ఆకలి తీర్చేందుకు డబ్బపాలను ఆశ్రయిస్తున్నారు కొంత మంది తల్లులు. ఈ క్రమంలో తల్లి పాలకు నోచుకోని ఎంతో మంది పసిబిడ్డలకు తన చనుబాలను పాల బ్యాంకుకు విరాళంగా ఇచ్చింది అమెరికాలోని ఒరెగాన్‍కి చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రా. తన ఇద్దరు బిడ్డలకు పాలు ఇస్తూనే ఏకంగా 1600 లీటర్ల పాలను దానం చేసి గిన్నీస్ రికార్డ్ సాధించింది.
దీనిపై ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఫ్యూర్టెరికో ద్వీపానికి చెందిన వాడు కావడంతో ఓ సందర్భంలో అక్కడికి వెళ్లానని, అక్కడ ఓ తల్లి లేని పసిబిడ్డకు పాలు పట్టానని అండర్సన్ సియోర్రా తెలిపింది. ఆ సమయంలోనే తల్లి పాలు పొందలేని వారికి చనుబాలను అందించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. దానిలో భాగంగానే 2015 నుంచి 2018 మధ్య కాలంలో 1600 లీటర్ల చనుబాలను పాలబ్యాంకుకు అందించానని తెలిపింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్ లో చోటు కల్పించారు. అయితే అధికంగా పాలు ఉత్పత్తి కావడానికి ఆమెలో ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడమేనని వైద్యులు తెలిపారు. సియెర్రాలో ఉన్న ఆ లోపమే ఎంతో మంది శిశువుల ఆకలి తీర్చడానికి కారణమయ్యింది.