నిత్యానందస్వామి.. అందరికీ తెలిసిన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. పలు నేరారోపణ, అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కేసులు, అరెస్టులు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈక్వెడార్ నుండి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస దేశమని పేరుపెట్టుకుని అక్కడే ఉంటున్నారు. అంతేకాదు తాను స్థాపించిన కైలాస దేశానికి తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడమే కాకుండా, స్వంత జెండా, చిహ్నం, కొత్త కరెన్సీని ముద్రించి సంచలనం రేపాడు. ఇదిలావుంటే.. నిత్యానందస్వామి కైలాస దేశంలో ఉద్యోగాలంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిత్యానందస్వామి దేశం వదిలి పారిపోయినప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం కొందరు ఇక్కడే ఉంటున్నారు. వారి సహకారంతో ‘కైలాసం’లో ఉద్యోగాలు చేయవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు అంతర్జాలంలో ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఉద్యోగాలకు ఎంపికైన వారు.. భారతదేశంలోని తమ శాఖల్లో ఒక ఏడాది వేతనంతో కూడిన శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణలో అర్హత సాధించిన వారికి మాత్రమే కైలాసంలో పని చేసేందుకు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. నిత్యానంద హిందూ విశ్వ విద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస ఐటీ విభాగం, కైలాస రాయబార కార్యాలయం, విద్యుత్తు శాఖ, గ్రంథాలయం తదితరాల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఉచితంగా శిక్షణ పొందుతూనే వేతనాన్ని పొందవచ్చని నిత్యానంద తాను నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు.
హెచ్‌డిహెచ్ వెబ్ సైట్ ప్రకారం.. ఆఫీస్ సెక్రటరీ, హెచ్‌డిహెచ్ ఆఫీస్ డిప్యూటీ సెక్రటరీ, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, డిప్యూటీ సెక్రటరీ డిఫెన్స్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ టీమ్, ఫుల్ టైమ్ ఆఫీసర్, పార్ట్ టైమ్ వాలంటీర్ మరియు అడ్వైజర్.