మానవ అక్రమ రవాణా నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలోకి ఆక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. అమెరికా – కెనడా సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టుకుని ఆ కుటుంబమంతా దుర్మరణం చెందింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విచారకరం.
వివరాల్లోకి వెళ్తే.. మైనస్ 36 డిగ్రీల ఉష్ణోగ్రత, కనుచూపు మేరలో అంతా మంచు మేటలే. దీనికి తోడు తీవ్రమైన మంచు తుపాను. ఆపై చిమ్మచీకటి. ఇంతటి భయానక వాతావరణంలో.. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ బోర్డర్ వద్ద అర్ధరాత్రి వేళ అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో.. తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక ఓ భారతీయ కుటుంబం మరణించింది. వీరిలో ఇద్దర్ని భార్యాభర్తలుగా.. ఓ చిన్నారి, టీనేజర్‌ను వారి పిల్లలుగా గుర్తించారు. వీరంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తూ.. తీవ్రమైన మంచు తుఫానులో చిక్కుకుని మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
జనవరి 19న ఈ ఘటన చోటుచేసుకోగా.. మృతులను తాజాగా గుర్తించారు. సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో ఈ మృతదేహాలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టుకుపోయి వీరంతా చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టగా.. చనిపోయినవారు భారత్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరు గుజరాత్ కు చెందిన జగదీశ్ పటేల్ (39), ఆయన భార్య వైశాలిబెన్ (37), కుమార్తె విహంగి జగదీశ్ కుమార్ (11), కుమారుడు ధార్మిక్ జగదీశ్ కుమార్ (3) అని కెనడియన్ అధికారులు వెల్లడించారు.
సరిహద్దుకు చేరుకునే ముందు కొద్ది రోజులు వీరంతా కెనడాలోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు దర్యాప్తులో తేలింది. పటేల్ కుటుంబం జనవరి 12న టొరంటో చేరుకుందని, అక్కడి నుంచి జనవరి 18న సరిహద్దుకు బయల్దేరిందని కెనడా పోలీసులు ద్రువీకరించారు. వీరి మృతిని కెనడా రాయబార కార్యాలయ అధికారులు ధృవీకరించారు. మృతదేహాలను భరత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు అమెరికా వైపున బోర్డర్ వద్ద ఓ వ్యాన్‌లో ఇద్దరు భారతీయులతో వస్తున్న స్టీవ్ శాండ్(47) అనే వ్యక్తిని యూఎస్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యాన్‌లో భారీ మొత్తంలో స్నాక్స్, డిస్పోజబుల్ పేట్లు, కప్పులను గుర్తించిన అమెరికా దళాలు.. మరింత మంది బోర్డర్ దాటబోతున్నారని అనుమానించి కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన కెనడా సిబ్బందికి.. మంచులో కూరుకుపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. బోర్డర్ వద్ద గాలింపు చర్యల్లో భారతీయులను గుర్తించి ప్రశ్నించగా.. మరణించిన నలుగురూ వీళ్ల సమూహం నుంచి విడిపోయిన వాళ్లేనని తేలింది. అమెరికాలోకి తీసుకెళతానంటూ ఓ వ్యక్తి తమతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, బోర్డర్ దాటేందుకు ఈ మార్గాన్ని సూచించి.. దాటాక తమను పికప్ చేసుకుంటానని చెప్పాడని వాళ్లు కెనడా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఈ కేసులో స్టీవ్ శాండ్ ప్రమేయాన్ని ప్రాథమికంగా గుర్తించిన అమెరికా దళాలు మానవ అక్రమ రవాణా కింద అతడిపై కేసు నమోదు చేశాయి.