నేడు ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీల్లో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలక పదవులు అలంకరించారు. తాజాగా మరో వ్యక్తి ఈ జాబితాలో చేరనున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా రేసులో భారత సంతతి వ్యక్తి నిలిచారు. ఆ వివరాలు..
నేడు ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలైన గూగుల్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వాటిల్లో భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులే కీలక పదవుల్లో ఉన్నారు. ఇక తాజాగా మరో భారతీయుడు ఈ జాబితాలో చేరడానికి అడుగు దూరంలో ఉన్నాడు. అన్ని అనుకూలిస్తే.. ఈసారి భారత సంతతి వ్యక్తి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా సదరు వ్యక్తికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు ఉండటమే కాక.. ఆయనే స్వయంగా నామినేట్ చేయడంతో.. మరింత ఆసక్తి నెలకొంది. ప్రపంచ బ్యాంకు డైరెక్టర్లు ఆమోదం తెలపడమే తరువాయి అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే.. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఆయనే భారత సంతతి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ బంగా.
అజయ్ బంగా.. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. ఆయన గతంలో మాస్టర్‌కార్డ్ అధ్యక్షుడిగా, సీఈవోగా విధులు నిర్వర్తించారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ప్రస్తుత తరుణంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామార్థ్యం బంగాకు ఉందంటూ ఆయన పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ సంస్థలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని బంగాను నామినేట్ చేసే సమయంలో బైడెన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. బంగా చాలా సమర్థవంతుడు. పర్యావరణ మార్పుల అంశం సహా ప్రస్తుతం ప్రపంచం ముందున్నఅన్ని సవాళ్లను బంగా సమర్థంగా ఎదుర్కోగలరని ఆశిస్తున్నానుఅన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్.. త్వరలోనే తాను పదవి నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2024 చివరకు డేవిడ్ మాల్పస్ పదవీకాలం ఉండగా.. రెండేళ్ల ముందే ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నారు. దాంతో ప్రపంచ బ్యాంకుకు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ మార్చి 29 వరకు కొనసాగుతోంది. అనంతరం బోర్డులోని డైరెక్టర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారే అధ్యక్షుడవుతారు. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికన్.. ఐఎంఎఫ్ చీఫ్‌గా యూరోపియన్లే కొనసాగుతారు. అయితే, మొదటిసారి అమెరికాయేతర వ్యక్తి నామినేట్ కావడం విశేషం. పైగా బంగాకు బైడెన్ మద్దతు ఉండటమే కాక ఆయనే స్వయంగా నామినేట్ చేయడంతో.. బంగా ఎన్నిక దాదాపు ఖరారైనట్లే అంటున్నారు. ఇక ప్రపంచ బ్యాంకులో అమెరికా అధిక వాటాలను కలిగి ఉంది. మరి బంగా రికార్డు క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.