పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశంలో చివరకు రొట్టెపిండి దొరకడం కూడా కష్టంగా మారింది. పాక్‌లోని పలు మార్కెట్లలో గోధుమ పిండి కోసం జనం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. గోధుమ పిండి కోసం పఖ్తున్‌ఖ్వా, సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లోని అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరగడం తెలిసిందే. ఈ విషయాన్ని అటుంచితే.. పాకిస్థాన్‌లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదని తెలుస్తోంది. రాజధాని నగరం ఇస్లామాబాద్‌తో పాటు కరాచీ, లాహోర్ లాంటి సిటీల్లోనూ అంధకారం అలుముకుంది. ట్రాన్స్‌మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం నెలకొన్నట్లు సమాచారం. పాక్‌లో ఉదయం 7.30 గంటల నుంచి కరెంట్ లేదని ఆ దేశ జర్నలిస్టు అసద్ తూర్ ట్వీట్ చేశారు. బలూచిస్థాన్‌లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని.. గుడ్డూ నుంచి క్వెట్టాకు వెళ్లే రెండు ప్రధాన ట్రాన్స్‌మిషన్ లైన్లు ట్రిప్ అవడంతో ఈ సమస్య తలెత్తిందని క్వెట్టా ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది.
ఇకపోతే, పాక్‌లో రోజురోజుకీ విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతోంది. ఆర్థిక కష్టాలతో సతమతమవుతుండటంతో ఇంధనం కొనుగోలు చేసేందుకు పాక్ దగ్గరర మారక నిల్వలు తగ్గిపోయాయి. డిమాండ్‌కు తగ్గట్లు అవసరాలు తీర్చేంత విద్యుదుత్పాదన లేకపోవడంతో పాక్ సర్కారు ఇటీవల జాతీయ ఇంధన సంరక్షణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీని కింద మార్కెట్లను రాత్రి 8.30కి, కల్యాణ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలనే పాక్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. తాజాగా తీవ్రస్థాయిలో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఈ రూల్స్‌ను మరింత కఠినతరం చేయనుందని సమాచారం. రాత్రిపూట లైట్ వేసినా శిక్ష తప్పదేమోననేలా అక్కడ పరిస్థితులు నెలకొన్నాయి. మరి, పాక్‌లో నెలకొన్న పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.