మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. ప్రస్తుత కాలంలో చేతిలో రూపాయి లేనిదే.. ఏ పని కాదు. మన జీవితంలో ఇంత ముఖ్య పాత్ర పోషించే డబ్బు సంపాదన కోసం.. రకరకాల పనులు చేస్తాం. కొందరికైతే నెలంతా కష్టపడి పని చేసినా సరే.. సరిపడా ఆదాయం లభించదు. ఉద్యోగంతో పాటు.. పార్ట్ టైంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ఎందరో ఉన్నారు. ఇంతలా కష్టపడితే కానీ ఫలితం ఉండదు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే వార్త కాస్త ప్రత్యేకమైనది. ఇక్కడ పని చేయకుండానే ఓ ఉద్యోగి ఏటా కోటి రూపాయలకు పైగా వేతనం పొందుతున్నాడు. వినగానే నమ్మశక్యంగా అనిపించదు.
కానీ మనసులో ఏదో ఓ మూల మాత్రం.. అబ్బా మాకు అలాంటి అవకాశం లభిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. అలాంటి పని దొరికితే.. జీవితాంతం అదే కంపెనీలో పని చేస్తాను అనుకుంటాం. ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. కానీ సదరు ఉద్యోగి మాత్రం.. కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పైగా తనపై అధికారులపై దావా వేస్తానని అంటున్నాడు. ఎందుకిలా.. పని చెప్పకుండ.. జీతం ఇస్తుంటే సంతోషించక దావా వేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి..
డబ్లిన్‌లోని ఐరిష్ రైల్ కార్పొరేషన్‌లో డెర్మోట్ అలస్టైర్ మిల్స్ అనే ఉద్యోగి ఫైనాన్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఉన్నతాధికారులు ఏం పని చెప్పకుండా ఏడాదికి ఏకంగా 1.03 కోట్ల రూపాయల జీతం ఇస్తున్నారు. దీనిపై మిల్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఉన్నతాధికారులు.. బలవంతంగా.. తనను పని చేయకుండా కూర్చోబెడుతున్నారని.. దీని వల్ల తాను విసుగు చెందానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంపెనీలో జరుగుతున్న అవకతవకల గురించి తాను ప్రశ్నించినందుకే ఉన్నతాధికారులు తనతో ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపాడు మిల్స్.
మిల్స్ సంవత్సరానికి 105,000 పౌండ్లు అనగా ఇండియా కరెన్సీలో చెప్పాలంటే.. రూ. 1.03 కోట్లు వేతనంగా పొందుతున్నాడు. ఇక అతడు చేసే పని ఏంటంటే.. శాండ్‌విచ్ తినడం.. వాకింగ్ చేయడం.. పేపర్ చదవడం ఇవే. మిల్స్ 2010లో ప్రమోషన్ పొందాడు. అయితే కంపెనీలో జరుగుతున్న అవకతవకల గురించి బయటకు వెల్లడించడంతో.. 2013 ఓ అతడు 3 నెలల సెలవు మీద వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మిల్స్, కంపెనీ మధ్య ఒక ఒప్పందం కుదరింది.
ఏంటంటే.. అతడికి గతంలో ఉన్న గుర్తింపు, సినీయారిటీ, అదే జీతం ఇప్పుడు కూడా అందజేస్తాం అనే షరతు మీద మిల్స్ తిరిగి కంపెనీలో చేరాడు. అయితే అప్పటి నుంచి అతడు ఈ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. తన సామార్థ్యాలకు తగ్గ ఏ పని అతడికి లభించడం లేదు. ప్రస్తుతం మిల్స్ మూడు రోజులు ఇంటి నుంచి.. రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్లి పని చేస్తాడు. ఉదయం పది గంటలకు రెండు శాండ్‌విచ్‌లు, 2 న్యూస్ పేపర్లు కొనుక్కుని ఆఫీస్‌కు వెళ్తాడు. తర్వాత తన కంప్యూటర్ ఒపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటాడు. కానీ దానిలో అతడికి ఎలాంటి మెయిల్ కానీ, కొలిగ్స్ నుంచి తన విధులకు సంబంధించి ఎలాంటి సూచనలు కానీ, తన పనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉండదు.
ఆ తర్వాత మిల్స్ శాండ్‌విచ్‌లు తింటూ పేపర్ చదువుతాడు. ఒకవేళ ఏదైనా మెయిల్, టాస్క్ వంటివి వస్తే.. వాటికి రిప్లై ఇవ్వడం, పూర్తి చేయడం చేస్తాడు. వీటన్నింటికి మొత్తం 30 నిమిషాలు కూడా పట్టదు. ఆ తర్వాత లంచ్ చేస్తాడు. మళ్లీ ఓ రౌండ్ షికారుకు వెళ్తాడు. 2.30-3.30 గంటల మధ్యలో షికారు నుంచి ఆఫీస్‌కు వచ్చి.. తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. ఉన్నతాధికారులు కావాలనే తనతో ఇలా చేయిస్తున్నారని.. ఇది ఒక రకంగా తన సామర్ధ్యాన్ని అవమానించడమే అని మిల్స్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఉన్నతాధికారుల మీద దావా వేశానని తెలిపాడు.