ఐపీఎల్ ఎంత బాగా ఆడినా అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ కోల్ కత్తా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు రింకూ సింగ్ తాను ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే అదరగొట్టాడు.
టీమిండియా నయా బ్యాటర్ రింకూ సింగ్ తొలి మ్యాచులోనే సత్తా చాటాడు. ఆడుతుంది తొలి టీ 20 ఇన్నింగ్స్ అయినా .. ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్ లాగా రింకూ ఆడిన ఇన్నింగ్స్ అందరిని ఆకట్టుకుంది. ఒక దశలో జట్టు స్కోర్ 160 పరుగులైనా చేరుతుందా అనుకున్న సమయంలో భారీ స్కోర్ అందించాడు. 21 బంతుల్లో 38 పరుగులు చేసి ఐపీఎల్ ఫామ్ ని అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిస్తున్నాడు. రింకూ ఇన్నింగ్స్ లో 3 సిక్సులతో పాటు 2 ఫోర్లు ఉండడం గమనార్హం. రింకూకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదంతా పక్కన పెడితే నిన్న మ్యాచులో రింకూ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసింది. ఇంతకీ ఏ విషయంలో రింకూ ధోనీని గుర్తు చేసాడో ఇప్పుడు చూద్దాం.
క్లాస్ లో ఎవరైనా ఆన్సర్ చెబుతాడు. ఎగ్జామ్ లో రాసినోడే టాపర్ అవుతాడు. ఈ డైలాగ్ రింకూకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఐపీఎల్ లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడిన ఈ కోల్ కత్తా బ్యాటర్.. తన ఇన్నింగ్స్ లు అన్ని గాలివాటమేమి కాదని ఎక్కడైనా తన బ్యాటింగ్ ఇలాగే ఉంటుందని నిరూపించాడు. ఒక ఫినిషర్ గా తన బాధ్యతని సమర్ధవంతంగా పోషించాడు. అయితే రింకూ ఇన్నింగ్స్ ఆసాంతం కూడా ఎక్కడా నిర్లక్ష్యపు షాట్ ఆడలేదు. తొలి 15 ఆచితూచి ఆడిన రింకూ.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ తన స్ట్రైక్ రేట్ ని అమాంతం పెంచేసాడు. రింకూ సింగ్ ఆడిన నిన్నటి ఇన్నింగ్స్ గతంలో ధోనీ ఎన్నో సార్లు ఆడాడు.
మొదట కంగారు లేకుండా కూల్ గా ఆడటం.. ఆ తర్వాత విధ్వంసం బౌలర్లకు చుక్కలు చూపించడం మహేంద్ర సింగ్ ధోనీకే సాధ్యం అనుకున్నాం. కానీ నిన్న రింకూ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఫినిషర్ గా ధోనీ బాధ్యతలు తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఒక్క మ్యాచ్ తో ఇలా పోల్చడం కరెక్ట్ కాకపోయినా.. భవిష్యత్తులో ఫినిషర్ గా రాణించే లక్షణాలు రింకూకి పుష్కలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆడిన తొలి ఇన్నింగ్స్ లోనే ఇంత పరిణితి ఆట చూపించడంతో ఇప్పుడు రింకూ సింగ్ మీద సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. మరి రింకూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటాడా ? లేకపోతే ఈ ఒక్క ఇన్నింగ్స్ తో సరిపెట్టుకుంటాడా ? చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.