పెళ్లంటే నూరేళ్ల పంట.. వివాహ కార్యక్రమాన్ని జీవితాంతం గుర్తుండి పోయేలా ఏర్పాట్లు చేస్తుంటారు తల్లిదండ్రులు. పెళ్లి రోజున వధువు పట్టు చీరతో పాటు దగదగ మెరిసే బంగారు ఆభరణాలు ధరిస్తుంది. సాధారణంగా ఏ పెళ్లికూతురు అయినా హారాలు, నెక్లెస్‌లు, గాజులు, పాపిటబిళ్ల, వడ్డాణం వంటి బంగారు నగలు ఒక్కోటి చొప్పున ధరిస్తుంది. అయితే చైనాలో ఒక పెళ్లికూతురు మాత్రం ఏకంగా 60 బంగారు నెక్లెస్‌లు పెట్టుకుంది. ట్విస్ట్ ఏంటేంటే.. ఆ బంగారు నగలు స్వయంగా వరుడే వధువుకి బహుమతిగా ఇచ్చాడు.
చైనాలో పెళ్లిళ్లకు బంగారం కొనడం, ధరించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మనదేశంలో బంగారానికి ఎంత విలువుందో చైనాలో కూడా అంతే విలువుంది. అందుకే బహుమతి అనగానే బంగారాన్నే కొనేవాళ్లు ఎక్కువమంది. గత నెలలో చైనాలోని హుబయ్ ప్రావిన్స్ లో జరిగిన పెళ్లిలో పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. మరీ ఎక్కువగా బహుమతులు ఇవ్వడంతో చైనా వధువు అవి మోయలేక చాలా ఇబ్బంది పడిపోయింది. ఆమె నానా తంటాలు పడుతుంటే వివాహానికి విచ్చేసిన అతిథులు జాలిపడ్డారు.
అరవై కిలోలు బరువును గంటల పాటూ మోయడమంటే మాటలా.. ఒక బంధువు సాయం అందించేందుకు వెళ్లగా వధువు చిన్నగా నవ్వి, తానే బాగానే ఉన్నానని, వివాహ ఆచారాలకు విలువనిస్తానని చెప్పిందట. ఇక నెక్లెస్ లు ఒక్కొక్కటి కిలోకి తక్కువ కాకుండా బరువు తూగాయిట. వరుడు చాలా ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తని తెలిసింది. కాగా ఈ వధువు ధరించిన బంగారు నెక్లెస్‌లు, గాజులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.