అమెరికా.. ఈ పేరు వినిపించగానే అగ్ర రాజ్యం అనే మాట కూడా వెంటనే గుర్తుకి వస్తుంది. ప్రపంచంలో ఆర్ధిక శక్తి నుండి, ఆయుధ సామాగ్రి వరకు, ప్రాశ్చాత్య సంబంధాల నుండి మౌలిక సదుపాయాల వరకు అమెరికాని తలదన్నే దేశం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ.., ఇంతటి పెద్దన్న దేశానికి కూడా కరోనా చీకటి రోజులను పరిచయం చేసింది. పోయిన ఏడాది కరోనా దెబ్బకి అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది అమెరికానే. అయితే.., అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విపత్కర పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో దారుణంగా విఫలం అయ్యారు. సరిగ్గా అలాంటి సమయంలోనే అమెరికాలో ఎన్నికలు జరిగాయి. తమ ప్రాణాలకు విలువ ఇవ్వని ట్రంప్ ని మరోసారి గెలిపించడానికి అమెరికన్ ప్రజలు ఇష్టపడలేదు. దీనితో వారికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఆశా దీపంలా కనిపించాడు. అలా బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నాడు. ఇక్కడ వరకు అందరికీ తెలిసిన చరిత్రే. కానీ.., కరోనా కోరల్లో చిక్కి.., కకావికలం అయిపోతున్న అమెరికాని బైడెన్ ఎలా కాపాడుకున్నాడు? ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? అసలు అక్కడ కరోనా ఎలా నియంత్రణలోకి వచ్చింది? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బైడెన్ అధ్యక్షుడు అయ్యే సమయానికి అమెరికాలో లక్షల పాజిటివ్ కేసులు ఉన్నాయి. కానీ.., అక్కడ ఎక్కువ కాలం లాక్ డౌన్ లాంటివి కూడా విధించలేదు. ఇక ట్రంప్ వ్యాక్సినేషన్ పై కూడా పెద్దగా ద్రుష్టి పెట్టలేదు. వ్యాక్సినేషన్ సక్సెస్ అవుతుందా? లేదా? అని ప్రపంచ దేశాలన్నీ సందిగ్ధంలో ఉన్న సమయం అది. కానీ.., బైడెన్ మాత్రం వ్యాక్సినేషన్ పక్రియపై నమ్మకం ఉంచాడు. తాను అధ్యక్షుడైన మొదటి వంద రోజుల్లోనే.. వంద మిలియన్ల మందికి టీకా ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇచ్చిన మాటని జో బైడెన్ ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఎంతలా అంటే.. తొలి వంద రోజుల్లో 200 మిలియన్ల మందికి టీకా పంపిణీ చేసింది అమెరికా ప్రభుత్వం. ఇది కేవలం బైడెన్ ముందు చూపుతోనే సాధ్యం అయ్యింది . ఇప్పుడు కూడా అమెరికాలో రోజుకి 30 లక్షల మందికి టీకా ఇస్తున్నారు. ఇక స్లాట్ బుకింగ్ గడువుకు పెద్దగా సమయం పట్టకపోవడంతో అమెరికన్స్ కూడా వ్యాక్సినేషన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు పుష్కలంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడంలో బైడెన్ సక్సెస్ అయ్యాడు. కానీ.., బైడెన్ ఆలోచన వ్యాక్సిన్ దగ్గరే ఆగిపోలేదు. కరోనా ఎక్కడికి పోదు.., వేరియంట్స్ రూపంలో మళ్ళీ తిరిగి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలను అయన సీరియస్ గా తీసుకున్నాడు. మొదటి వేవ్ కి, సెకండ్ వేవ్ కి మధ్య గ్యాప్ లో తమ దేశ వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేశాడు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాడు. బెడ్స్, ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకున్నారు. అలా.. అమెరికన్స్ ప్రాణాలను కాపాడటానికి బైడెన్ ప్రభుత్వం అన్నీ చర్యలను సమర్ధవంతంగా నిర్వర్తించింది. దీనితో ఇప్పుడు అమెరికాలో పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువకే పడిపోయింది. మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావించిన అమెరికా ఇప్పుడు సురక్షిత స్థానంలో ఉంది. ఇందుకే ఇప్పుడు అమెరికన్స్ దృష్టిలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఓ హీరోగా మారిపోయాడు.