ఏడు ఖండాలు కాస్తా ఎనిమిది ఖండాలు కాబోతున్నాయా? ప్రపంచ పటం మారబోతోందా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉన్న ఆఫ్రికా ఖండం రెండు ముక్కలు కాబోతుందని అంటున్నారు.
భూభాగంలో మార్పులు అనేవి సహజం. ఏళ్ళు గడిచే కొద్దీ భూభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ. భూభాగం నిరంతరం మారుతూనే ఉంటుంది. వేల సంవత్సరాలు గడిచే కొద్దీ భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి భారీ మార్పు ఆఫ్రికా ఖండంలో చోటు చేసుకోబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆఫ్రికా ఖండం రెండు ఖండాలుగా చీలనుందని అంటున్నారు. వీటి మధ్య కొత్త సముద్రం పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ కారణంగా ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోతుందని అంటున్నారు. ఈ పరిణామం కొన్ని వేల ఏళ్ల తర్వాత చోటు చేసుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు భూమి లోపల, భూమ్మీద మొదలయ్యాయని భూగర్భ నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ మార్పును శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలకగా పేర్కొంటున్నారు.
భూగర్భంలో ఒక పలక (టెక్టానిక్ ప్లేట్) రెండుగా విడిపోవడాన్ని చీలికగా పరిగణిస్తారు. ఈ పలకలు కదలడం మొదలైతే భూ ఉపరితలం మీద, భూగర్భంలో లోయ లాంటి పగుళ్లు ఏర్పడతాయి. 138 మిలియన్ ఏళ్ల కిందట ఇలాంటి పరిణామం వల్ల దక్షిణ అమెరికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి మార్పే ఆఫ్రికా ఖండంలో చోటు చేసుకోనుందని అంటున్నారు. 2005లో ఇథియోపియా ఎడారిలో 56 కిలోమీటర్ల పొడవునా భారీ పేగులు ఏర్పడింది. 2018లో కెన్యాలో కూడా ఇలాంటి భారీ పగులు సంభవించింది. సముద్రం కింది భాగంలో పలకల కదలికల వల్లే పగులు సంభవించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఆఫ్రికన్ నుబియన్, ఆఫ్రికన్ సొమాలి, అరేబియన్ అనే పలకల వద్ద పగుళ్ళను గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంకేతంగా భావిస్తున్నారు. భూగర్భంలో మొదలయ్యే పగులు.. ఉపరితలం మీద వరకూ చేరి.. సముద్ర ఆవిర్భావానికి కారణం కాబోతోందని లీడ్స్ యూనివర్సిటీ పరిశోధకుడు క్రిస్టోఫర్ మూర్ వెల్లడించారు.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్ర సముద్రంలోని నీరు ఈ పగులులోకి ప్రవేశించి కొత్త సముద్రంగా ఆవిర్భవించడానికి కారణమవుతుందని అంటున్నారు. వేల కిలోమీటర్ల పొడవునా ఉండే ఈ చీలిక కారణంగా ప్రస్తుతం ఉన్న సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలో కొన్ని ప్రాంతాలు కలిసి కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చీలిక పక్రియ పూర్తవ్వడానికి వేల సంవత్సరాలు పడుతుందని.. కొత్త సముద్రం ఆవిర్భవించడానికి 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చునని చెబుతున్నారు. సముద్రం లేని ఉగాండా, జాంబియా దేశాలకు తీర ప్రాంతం వస్తుంది. చీలిక లోయలో తూర్పు భాగంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ భారీ మార్పులు కనిపించడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని నైరోబీ యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర విభాగం పరిశోధకుడు ఎడ్విన్ డిండి వెల్లడించారు. మరి ఆఫ్రికా ఖండం రెండు ఖండాలుగా చీలుతుందని శాస్త్రవేత్తలు చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.