కరోనా వచ్చాక మనిషి శరీరంలో ముందుగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. దీని కారణంగా శరీరానికి గాలిలోని ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఇలా ఊపిరితిత్తుల పనితనం తక్కువైనపుడు రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గి, అనేక దుష్పరిణామాలకు దారితీసి, అవయవాలు విఫలమై ప్రాణాల మీదకి వస్తోంది. కానీ.., మీకు తెలుసా? మనిషి ఊపిరితిత్తులలో కొంత భాగం పెద్దగా వినియోగంలో లేకుండా ఉంటుంది. అలా పనిలేకుండా పక్కన ఉన్న ఊపిరితిత్తుల భాగాలను పని చేయించడం మొదలు పెడితే… ఆక్సిజన్ సాచురేషన్ గణనీయంగా పెరుగుతుంది. మన శరీరం లో ఛాతి వైపున ముందు భాగంలో గుండె కొంత భాగం ఆక్రమించి ఉంటుంది. దీనితో.. ఊపిరితిత్తుల ముందు వైపు భాగం తక్కువగా. వెనుకవైపు ఎక్కువ భాగం ఉంటుంది. సుమారు 40 శాతం భాగం ఊపిరితిత్తులు ముందు వైపున ఉంటే, 60 శాతం భాగం వీపు వైపుకి ఉంటుంది. మనం గాలి తీసుకొనే టపుడు ఛాతి మాత్రమే కదులుతుంది. వీపు వైపు కదలదు.అలాగే మనలో ఎక్కువ మంది వెల్లకిలా పడుకుంటాము. దానితో వీపు వైపున ఉన్న భాగం కొంత ఒత్తిడికి కూడా లోనవుతుంది. వెల్లకిలా పడుకున్నప్పుడు ఊపిరితిత్తుల వెనుక భాగం లో రక్తం సరఫరా ఉన్నప్పటికీ ఆక్సిజన్ ను గ్రహించే స్థితిలో ఉండవు. అనగా ఛాతి వైపున ఉన్న ఊపిరితిత్తుల భాగం దాదాపుగా పూర్తి స్థాయి లో వినియోగంలో ఉంటే, వీపు వైపున ఉన్న భాగంలో సగం వరకూ నిర్లిప్తత తో ఉంటుందన్న మాట.
కానీ.., వెల్లికిలా కాకుండా మనం బోర్లా పడుకున్నప్పుడు వీపు వైపున ఉన్న ఊపిరితిత్తులలోని గాలి గదులు తెరుచుకొని, గాలి నుండి ఆక్సిజన్ తీసుకోవడం మొదలు పెడతాయి. దీనివలన ఆక్సిజన్ గ్రహించగలిగే ఊపిరితిత్తుల ఉపరితలం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆక్సిజన్ సాచురేషన్ శాతం గణనీయంగా పెరుగుతుంది. కోవిడ్ మొదటి దశలో ఉన్నప్పుడు ఇలా చేస్తే.. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి హాస్పిటల్ పాలు కావాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఇక కుడిపక్కకు తిరిగి పడుకోవడం, ఎడమపక్కకు తిరిగి పడుకోవడం, వీపు వైపున దిండ్లు పెట్టుకొని 60–90 డిగ్రీలలో జారబడి ప్రశాంతంగా కూర్చోవడం లాంటివి కూడా చేయాలి. ఇలా భంగిమలను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యవచ్చును. ఈ భంగిమలలో ప్రశాంతంగా శ్వాసక్రియ జరగడం వల్ల వీపు మీద ఒత్తిడి తగ్గుతుంది. దీని మూలంగా నిద్రాణంగా ఉన్న ఊపిరితిత్తుల భాగాలు చేతనమై, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ఇస్తుంది.ఇది శాస్త్రీయంగా నిరూపించబడ్డ తేలికైన విధానం. ఒక్కమాటలో చెప్పాలంటే తనకు ఉన్న రిజర్వ్ ను వాడుకలోకి తెచ్చే విధంగా శరీరానికి మనం సహకరిస్తున్నాం అన్నమాట. రీపొజిషనింగ్ గా చెప్పబడుతున్న ఈ భంగిమల మార్పు పై కొన్ని అధ్యయనాలలో 6 % నుండి 11 % మేరకు ఆక్సిజన్ శాచురేషన్ పెరిగినట్లు గమనించారు. ఇక కోవిడ్ సోకని, ఆరోగ్యవంతులు ఈ రీపొజిషనింగ్ చేయాల్సిన పని లేదు.