ఎండాకాలంలో వేడి గాలులు, ఉక్కపోత, చెమట చిరాకును తెప్పిస్తున్నాయి. ఏ ఆహారం తీసుకోవాలన్నా.. కడుపులోకి వెళ్లడం లేదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలు లాగించేస్తుంటాం. అయితే ఇవి తిన్న దగ్గర నుండి రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఇంట్లోనే హెల్తీ డ్రింక్స్, దాహార్తిని తీర్చే పానీయాలు తయారు చేసుకోవచ్చు.
ఎండాకాలం వచ్చేసింది. ఇంట్లో నుండి బయట అడుగు పెట్టాలంటే భయపడాల్సి వస్తుంది. ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే వేడి గాలులు, ఉక్కపోత, చెమట చిరాకును తెప్పిస్తున్నాయి. నీరు ఎక్కువగా తాగేయడం వల్ల ఏ ఆహారం తీసుకోవాలన్నా.. కడుపులోకి వెళ్లడం లేదు. దీంతో శీతల పానీయాల వైపు మనస్సు మళ్లీ పోతుంది. దీంతో చల్లటివి తినాలని ఆరాటపడుతుంటాం. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలు లాగించేస్తుంటాం. అయితే ఇవి తిన్న దగ్గర నుండి రోగాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక పెద్దల సంగతి పక్కన పెడితే.. పిల్లలు కూడా ఇవి కావాలని మారాం చేస్తుంటారు. కొని ఇచ్చాక.. జలుబు, ఆయాసం వంటి రోగాలు వస్తుంటాయి. వీటిని దూరం చేయాలంటే.. ఈ వేసవిలో దాహార్తితో పాటు ఆరోగ్యకరమైన పానీయాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే..?
లస్సీ.. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందాన్ని ఇస్తుంది. చిక్కటి పెరుగులో కాస్తంత పంచదార వేసుకుని, కాస్తంత చిలుక్కొని తాగితే.. ఆ మజానే వేరు. ఇది వేసవిలో మంచి హెల్తీ డ్రింక్. ఇది ఉత్తరాది ప్రాంతాల వారు ఎక్కువగా సేవిస్తుంటారు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కావున ఆరోగ్యానికి చాలా మంచిది.
నిమ్మరసం.. ఇది తేలికగా అయిపోయే హెల్త్ డ్రింక్ . రెండు పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకుని, ఓ గ్లాసులో పిండి అందులో నీరు పోసి కాస్త ఉప్పు, కాస్త పంచదార కలిపి తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని తాగితే భలే రుచిగా ఉంటుంది. ఈ నిమ్మరసంలో సీ విటమిన్ లభిస్తుంది. ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి. హెవీ ఆహారం తీసుకున్న సమయంలో కూడా కాస్తంత నిమ్మరసం తీసుకుంటే రిలీఫ్ అనిపిస్తుంది.
రాగి జావ.. రాగి పిండితో తయారు చేసే ఈ జావ సమ్మర్‌లో మంచి బలవర్థకమైన పానీయం. రాగి పిండిని తీసుకుని.. దానిని నీళ్లలో వేసి కాస్త నాన బెట్టాలి. పొయ్యి మీద గిన్నెలో కొంచెం నీళ్లు వేడి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకుని.. ఉడకబెట్టాలి. చల్లారాక మజ్జిగ, పెరుగు లేదా నిమ్మరసం వేసుకుని తాగితే..కడుపునిండిన ఫీలింగ్ వస్తుంది. రాగుల్లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి12 అనేక మినరల్స్ ఉంటాయి.
బార్లీ.. బార్లీ గింజలను నానబెట్టి అనంతరం వాటిని ఉడకబెట్టాలి. బాగా పల్చగా కాచుకుని .. అందులో నిమ్మ రసం పిండుకుని తాగినా, లేదా పంచదార వేసుకుని తాగినా.. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఎండకాలంలో పచ్చళ్లు, వేడి చేసే పదార్ధాలు తిని బాధపడుతున్నారా..అయితే బార్లీ నీళ్లు చక్కని పరిష్కారం. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి బార్లీ నీళ్లు అమృతంతో సమానం.
మజ్జిగ.. ఇది రోజు తీసుకున్నా.. వేసవిలో ఎక్కువ మోతాదులో తీసుకుంటే మరీ మంచిది. ఇంట్లో పుష్కలంగా దొరికే ఏకైక పానీయం ఇదే. కొద్దిగా పెరుగులో రెండింతలు నీరు పోసి, ముక్కలు లేకుండా చిలకొట్టుకుని, కొద్దిగా ఉప్పు వీలుంటే నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. లేదా జీలకర్ర వంటివి వేసుకుని కూడా తాగితే మంచిది.
సబ్జాలు.. పావు గంటలో తయారు చేసుకోవచ్చు. వీటిని కాస్త నీటిలో వేసి నానబెట్టుకుని, ఆ తర్వాత ఎక్కువ మోతాదు నీళ్లలో కలుపుకుని, చక్కెర, నిమ్మరసం, కాస్తంత పుదినా వేసుకుని తాగితే .. ఆ డ్రింక్ మజానే వేరు. దీని ద్వారా వెయిట్ లాస్ కూడా అవుతారు. వేడిని కూడా తగ్గిస్తుంది. ఇవే కాదూ సగ్గు బియ్యం పలచగా కాచుకుని తాగడం.. సుగంధి వంటివి కూడా వేసవి తాపాన్ని తీరుస్తాయి. అంతేకాకుండా పళ్ల రసాలు కూడా ఎంతో మేలు చేస్తాయి.