ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక వసతుల పరంగా ఏమైనా లోపాలున్నాయా అని తెలుసుకునేందుకు స్వయంగా అధికారులు వస్తేనే మంచిదని చాలామంది పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయం. ప్రభుత్వ అధికారుల పిల్లలను కూడా సర్కారు బడిలో చేరిస్తే.. అక్కడి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో వారికి తెలుస్తుందంటారు కొందరు.
ఇలాంటి అభిప్రాయాలు అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడి పిల్లల తల్లిదండ్రులది. ఆవిధంగానే తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశల ప్రకారం… అధికారులంతా ఇకపై సర్కారు బడికి వెళ్లి పాఠాలు బోధించనున్నారు. ఇందులో భాగంగా ఐఏఎస్ అధికారులతో పాటు హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను బడిబాట పట్టించనుంది అక్కడి ప్రభుత్వం. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ కార్యక్రమం అమలు చేయనుంది. అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో తమ అనుభవాలను విద్యార్థులకు బోధించనున్నారు. భవిష్యత్తు గురించి మార్గనిర్ధేశం చేయనున్నారు. ఇదే సమయంలో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు, అక్కడి వసతులను వీరు పరిశీలించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.