న్యూ ఢిల్లీ- గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్థంబిస్తోంది. ఐతే రానున్న వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని భారత వావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల పునరుజ్జీవన ప్రభావంతో జోరుగా వానలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
రాబోవు వారం రోజుల పాటు దేశంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. పశ్చిమ హిమాలయ ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్ లలో శనివారం నుంచి ఈ నెల 20 వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జులై 18 నుంచి 20వ తేదీ వరకు హర్యానా, తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్,పంజాబ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జులై 18న దేశరాజధాని ఢిల్లీలోనూ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో జులై 18న ఉత్తరప్రదేశ్, జులై 19న జమ్మూ కశ్మీర్, జులై 18, 19 తేదీల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీ వర్షాలు, ఉరుముల వల్ల ప్రజలు, జంతువులకు ప్రాణనష్టం జరిగే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
గోవా, కొంకణ్, మధ్య మహారాష్ట్ర ఘాట్, కర్ణాటక, కేరళలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలో జులై 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయాని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.