నేషనల్ డెస్క్- పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో ఒక్కసారిగా రైలు బోగీలు ట్రాక్ పై నుంచి పల్టీలు కొట్టాయి. జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్ జల్‌పైగురి జిల్లాలోని దోమోహని ప్రాంతంలో పట్టాలు తప్పింది. ట్రైన్ ఒక్కసారిగా భారీ కుదుపునకు గురికావడంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. రైలుకు చెందిన మొత్తం 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగింది.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బోగీలలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటవలో క్షతగాత్రులను రక్షించేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వంద మందికిపైగా ప్రయాణికులను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
రైలు ప్రమాద ప్రయాణికులకు కోసం ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సైతం అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు ట్రైన్ ప్రమాదం ఘటనపై రైల్వే అధికారులు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 వేల రూపాయలు అందజేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాదంపై ఆరా తీశారు.