యాదాద్రి భువనగిరి జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదం తెలిసిందే. అయితే ప్రమాద సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గత శుక్రవారం జులై 7న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరు బోగీలు కాలి బూడిదయ్యాయి. ప్రయాణికులు, అధికారులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ప్రమాదసమయంలో వేలమంది ప్రాణాలను నిలిపిన రాజు సమయస్ఫూర్తిని మెచ్చుకోవలసిందే. ప్రమాదాన్ని ముందే తెలుసుకుని చైన్ లాగి.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. బొల్లారం పుర పరిధి లక్ష్మీనగర్‌లో పదేళ్లుగా తన ఫ్యామిలీతో నివాసముంటున్నాడు. ఇతడు పాతపట్నం చిన్న మల్లెపురానికి చెందినవాడు. ప్రమాదం జరిగిన రోజు విషయాలను వెల్లడించాడు. రాజు తెలిపిన వివరాల ప్రకారం..
ఒడిశాలోని రాజు అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి వస్తున్న తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కారు. తనతోపాటు తల్లి, చెల్లి, పెద్దమ్మతో కలిసి S4 బోగీలో కూర్చున్నారు. రాజు పై బెర్తులో పడుకొని ఉన్న సమయంలో ఏదో రబ్బరు కాలిన వాసన గమనించాడు. కొద్దిసేపటికి రబ్బరు వాసన ఇంకా ఎక్కువగా వస్తుంది. కిందికి దిగి కిటికీలోంచి చూస్తే పొగ వస్తుంది. వెంటనే కేకలు వేసి..ప్రయాణికులను అందరిని అప్రమత్తం చేశాడు. చైన్ లాగాడు. రైలు ఆగిపోయిన తర్వాత తన కుటుంబీకులను మొదట కిందికి దించాడు. వేరే ప్రయాణికులను దించడానికి సహాయం చేశాడు. మంటలు, పొగలు దట్టంగా అలముకోవడంతో అగ్నిమాపక కేంద్రానికి, 108కు సమాచారం చేరవేశాడు. మంటల్లో వారి లగేజ్ అంతా కాలి బూడిదయ్యింది.
పొగ ఎక్కువగా పీల్చుకోవడంతో రాజు సృహ కోల్పోయి పడిపోయాడు. భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు సృహలోకి వచ్చాడు. బొల్లారంలో తన ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటల సమయం అయింది. ప్రమాదాన్ని గుర్తించడం, కేకలు వేయడం, ప్రయాణికులను అప్రమత్తం చేయడం, వారిని రైలులోంచి కిందికి దించడం అంతా క్షణాల్లో అయిపోయింది. లేకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు. మరో ఐదు, ఆరు నిమిషాలైనా తీరని నష్టం జరిగేది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు రాజు.