హైదరాబాద్- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో గాయాలతో బయటపడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. వరుణ్ సింగ్ స్పస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.
ఆయన విధి నిర్వహణలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పని చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చనిపోయి ప్రజల గుండెల్లో అమరుడై నిలిచిపోయిన వరుణ్ సింగ్ కు హైదరాబాద్ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన ఇంజనీర్లు, పైలట్లు మొదట శిక్షణ పొందేది హైదరాబాద్ శివారులోని దుందిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలోనే. వరుణ్ సింగ్ కు కూడా హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలోనే శిక్షణ పొందారు.
ఇంటర్మీడియెట్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమికి ఎంపికయ్యి, ఆఫీసర్ క్యాడెట్‌గా ఉత్తీర్ణుడయ్యాక వరుణ్ సింగ్ మొట్టమొదట అడుగుపెట్టింది హైదరాబాదులోనే. ఫైటర్ పైలెట్ కావడం వల్ల హకింపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన శిక్షణ పొందారు. అలా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో వరుణ్ సింగ్ శిక్షణ తీసుకోవడంతో పాటు, పనిచేశారు కూడా.
ఆ తరువాత వరుణ్ సింగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కావడమే కాకుండా, ఒక ప్రత్యేకమైన కోర్స్ చేసి ఫ్లయ్యింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయ్యారు. 2007- 09 మధ్య గోరఖ్‌పూర్ ఏఐఎఫ్ బేస్‌లో పనిచేశాక, ఆయనని ఫ్లయ్యింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా 2009లో హకింపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఎక్కడైతే వరుణ్ సింగ్ తొలినాళ్లలో ట్రైనింగ్ తీసుకున్నారో, తిరిగి అక్కడికే ఆయన ఇన్ స్ట్రక్టర్ గా వచ్చారు.