నగరంలోని ఎల్పీనగర్ పరిధి సాహెబ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్‍లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. మ్యాన్‌హోల్‌లో ఊపిరాడక మృతి చెందిన ఒక కార్మికుడిని బయటకి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.
ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయాల్లో డ్రైనేజి క్లీన్ చేసేందుకు అనుమతి లేదనే స్పష్టమైన నిబంధనలు జీహెచ్‌ఎంసీలో ఉన్నాయన్నారు. అయితే ఉదయం వేళల్లో వాటర్ ప్రవాహం ఎక్కువగా ఉంటుదని రాత్రి ప్రవాహం తక్కువ ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే ఈ పనికి పూనుకున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
సాహెబ్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘సాహెబ్ నగర్ లో విధి నిర్వహణ కోసం మ్యాన్ హోల్ లో దిగి, ఊపిరాడక జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అంతయ్య, శివ మృతి చెందడం విచారకరం. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ విధులు చేయించిన అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.