స్పోర్ట్స్ డెస్క్- డ్వేన్ బ్రావో.. ఈ క్రికెట్ దిగ్గజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెస్టిండీస్ క్రికెట్ అటగాడైన బ్రావో ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌళింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింట్లో డ్వేన్ బ్రావో తన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు. వెస్టిండీస్ క్రికెట్ జట్టులో బ్రావో స్థానం ప్రత్యేకం అని చెప్పక తప్పదు.
అదిగో అలాంటి డ్వేన్ బ్రావో క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే నిర్ణయం తీసుకున్నాడు. ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు బ్రావో తెలిపాడు. గురువారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో విండీస్ ఓటమి తర్వాత బ్రావో ఈ ప్రకటన చేశాడు.
గత 18 ఏళ్లుగా వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని డ్వేన్ బ్రావో చెప్పాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని బ్రావో తెలిపాడు. గురువారం టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకతో మ్యాచ్ తరువాత ఫేస్ బుక్ లైవ్ లో బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు.
డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిడైర్డ్ అవుతున్నట్లు ప్రకటించగానే అంతా షాక్ అయ్యారు. ఇంత త్వరగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటారని తాము అనుకోలేదని క్రికెట్ ప్రముఖులు అన్నారు. బ్రావో తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.