ఐపీఎల్-2023లో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఒకటి. అయితే ఈ రూల్ అందరికీ వర్తించినా.. ధోనీకి మాత్రం వర్తించదని ఒక మాజీ క్రికెటర్ అంటున్నాడు. అతడి మాటల్లోని మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ పదహారో సీజన్లో తీసుకొచ్చిన కొత్త రూల్స్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఒకటి. ఈ రూల్ ద్వారా జట్టులోకి అదనంగా ఒక బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీంతో కొందరు సీనియర్లు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్లో చాలా మందితో పాటు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ‘ఇంపాక్ట్’గా ఆడారు. గాయంతో ఇబ్బంది పడిన డుప్లెసిస్ ఈ రూల్ వల్ల కేవలం ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగేవాడు. అయితే మోకాలి గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మాత్రం ఈ రూల్‌ను ఒక్కసారి కూడా వాడుకోలేదు. ఒకవేళ ధోని ఈ రూల్‌ను ఉపయోగించుకుంటే అతడు మరికొన్ని సంవత్సరాలు ఆడతాడని సీఎస్కే కోచ్ డ్వేన్ బ్రావో అన్నాడు. డ్వేన్ బ్రావో వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సమర్థించలేదు.
ధోనీకి ‘ఇంపాక్ట్’ రూల్ అస్సలు వర్తించదని పేర్కొన్నాడు సెహ్వాగ్. దానికి గల కారణాలను ఆయన విశ్లేషించాడు. 40 ఏళ్లు పైబడ్డాక క్రికెట్ ఆడటం కష్టమేమీ కాదని.. అయితే ధోని మాత్రం కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. గ్రౌండ్లో వ్యూహాలను రచిస్తూ, ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అతడు ఈ సీజన్లో చివరి రెండు ఓవర్లలోనే బ్యాటింగ్‌కు దిగాడని.. మొత్తం మీద 40 నుంచి 50 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నాడని తెలిపాడు. ధోని 20 ఓవర్లు గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తాడు కాబట్టి అతడు ఇంపాక్ట్ రూల్‌తో ఆడడని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. మాహీని భవిష్యత్తులో కోచ్‌గా లేదా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో చూసే ఛాన్స్ ఉందన్నాడు సెహ్వాగ్. మరి.. ధోనీకి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ వర్తించదంటూ వీరూ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.