చండీగఢ్- వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, వివాదాస్పద డేరా బాబ అలియాస్.. గుర్మీత్ రాం రహీం సింగ్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత కారాగార శిక్ష విధించింది. డేరా బాబాతో పాటు మరో నలుగురికి కూడా కోర్టు ఇదే శిక్ష ఖరారు చేసింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం జరిగిన డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో విచారణ అనంతరం కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఈ కేసులో పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రాం రహీం సింగ్ తో పాటు కృష్ణణ్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్‌లను కూడా దోషులుగా నిర్ధారించింది. డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ ఖాన్పూర్ కోలియన్ గ్రామంలో 2002 జూలై 10న హత్యకు గురయ్యాడు.
డేరా బాబా ఆశ్రమంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై అప్పట్లో విడుదలైన ఓ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ లేఖను రంజిత్ సింగ్ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. ఈ తరుణంలో డేరా బాబానే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. 2002 లో సీబీఐ ఈ హత్యపై కేసు నమోదు చేసి విచారణ జరిపింది.
తన ఆశ్రమంలో జరుగుతున్న లైంగిక అరాచకాలపై మేనేజర్ రంజిత్ సింగ్ లేఖ రాశాడని, అతనిపై కక్ష్య గట్టి డేరా బాబానే అతన్ని హత్య చేయించాడని సీబీఐ విచారణలో తేలింది. ఈ కేసును సుదీర్గంగా విచారించిన పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈమేరకు సోమవారం తీర్పు వెలువరించింది. డేరా బాబాతో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది.