వ్యాపారం అంటేనే ఒక భయం. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా.. లాభాలు వస్తాయో రావో అన్న బెంగ. నష్టాలు దరిచేరితే ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితులు వస్తాయన్న ఆలోచనలు. అందుకే.. అందరూ నెల జీతం వచ్చే ఉద్యోగాలనే ఇష్టపడుతుంటారు. కానీ, ఈ దంపతులు అందుకు విభిన్నం. వారి దృఢ సంకల్పమే.. విజయానికి వారిని దగ్గర చేసింది. చిన్న చిన్న సమోసాలు స్థాయి నుంచి నేడు కోట్లు ఆర్జించేవరకు.. వారి ప్రయాణం ఒక మధుర జ్ఞాపకం. బీటెక్ చదువుతో మొదలైన వీరి ప్రయాణం మొదలు.. విజయం సాధించేవరకు ప్రతి సన్నివేశం మీకోసం..
లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించాలని కలడం కనడం అందరూ చేసే పనే. కానీ, ఆ కలను సాకారం చేసుకునేది.. అతి కొద్దీ మంది మాత్రమే. వారిలో ఈ దంపతులు ఒకరు. మంచి ఉద్యోగం, నెలకు లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని వ్యాపారం వైపు అడుగులు వేశారు. ఆ ధైర్యమే వారిని దేశమంతటా మాట్లాడుకునేలా చేసింది. వాస్తవంగా చెప్పాలంటే.. ఈ దంపతుల సక్సెస్ స్టోరీ ఒక అద్భుతం. కంఫర్ట్ లైఫ్‌ని వదిలి.. చాలెంజింగ్ లైఫ్‌లోనే థ్రిల్ ఉందని నమ్మి, ఆచరించి, విజయం సాధించే వరకు ప్రతి చిన్న సన్నివేశం ఒక సినిమా స్టోరీయే.
నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్.. వీరిద్దరూ ప్రేమ పక్షులు. హర్యానాలో బీటెక్ చదువుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయమైంది. అది ప్రేమకు దారితీసి.. ఏడడుగుల బంధానికి దగ్గరచేసింది, ఈ ప్రయాణంలో వాళ్లిద్దరూ అందరిలానే పార్కులకు తిరిగారు.. సినిమాలకు వెళ్లారు. కానీ, వారి కలలను ఏనాడూ మరువలేదు. జీవితంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించి విజయం సాధించాలనే ఆలోచన ఎప్పుడూ వారి మదిలోనే మెదిలేది. ఈ దంపుతుల తల్లిదండ్రులు ఉన్నతంగా, ఆర్థికంగా బాగా ఉన్నవారే. నిధి తండ్రి న్యాయవాది కాగా, శిఖర్ తండ్రికి చండీగఢ్, అంబాలాలో నగల దుకాణం ఉంది. అయినప్పటికీ ఈ జంట వీరి నుంచి ఎలాంటి సహాయం తీసుకోకూడదు అనుకున్నారు. తమ పొదుపుతో వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు.
బీటెక్ చదువు అయిపోగానే శిఖర్ హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ నుంచి ఎంటెక్ డిగ్రీ పూర్తి చేశాడు. బయోకాన్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా విధుల్లో చేరాడు. నిధి కార్పొరేట్ జాబ్‌లో జాయిన్ అయింది. ఇద్దరివి మంచి ఉద్యోగాలు… లక్షల రుపాయల జీతం. ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేదు. బీటెక్ రోజులు గుర్తొచ్చాయి. బయటకి వెళ్లినప్పుడల్లా తినే సమోసా జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. చదువుకునే రోజుల్లో శిఖర్.. నిధీతో ఎస్‌బీఐ బ్యాంకుల ముందు సమోసాలు అమ్మే బిజినెస్ చేయాలని అనేవాడు. ఆ ఆలోచనను ఆమె నవ్వుతూ కొట్టిపారేసేది. సైంటిస్ట్‌గా కెరియర్ పై దృష్టి పెట్టాలని సూచించేది. అలా ఐదేళ్లు గడచిపోయాయి. చివరికి ఆ జ్ఞాపకాలే.. వారి వ్యాపారానికి పునాది అయ్యాయి.
2015లో ఇద్దరూ ఉద్యోగాలు వదిలేసి.. అన్ని విషయాలు తెలుసుకొని మరుసటి సంవత్సరమే సమోసాలు అమ్మడం ప్రారంభించారు. ఈ సమయానికి శిఖర్ ప్యాకేజీ రూ. 30 లక్షలు. ఈ నిర్ణయం వారి తల్లిదండ్రులకు వింతగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. వేరే వ్యాపారం పెట్టిస్తామన్న వినలేదు. తమ కలల ప్రపంచాన్ని ఊహించుకుంటూ.. సమోసాలు విక్రయించడం మొదలు పెట్టారు. సవాళ్లు ఎదురయ్యాయి. పొదుపు చేసిన డబ్బులన్నీ అయిపోయాయి. పెద్ద కిచెన్ ప్రారంభించాలంటే లక్షల డబ్బు అవసరం వచ్చింది. ఏం చేయాలో తెలియలేదు. తాము ఇష్టంగా కొనుక్కున్న అపార్ట్ మెంట్ ను రూ. 80 లక్షలకు అమ్మేశారు. ఆ డబ్బుతో ఒక ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని ‘సమోసా సింగ్ (Samosa Singh)’ పేరిట బిజినెస్ ప్రారంభించారు.
రోజులు గడిచే కొద్దీ వారి బిజినెస్ పాపులర్ అయ్యింది. జనాల తాకిడి బాగా పెరిగింది. బటర్ చికెన్ సమోసా, కడాయి పన్నీర్ చికెన్ సమోసా.. అంటూ కొత్త కొత్త వెరైటీలను రూపొందించడం మొదలుపెట్టారు. నేడు ఆ వ్యాపారమే దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇప్పుడు వారు నెలకు కనీసం 30 వేల సమోసాలను అమ్ముతారు. వారి టర్నోవర్ రూ. 45 కోట్ల పైమాటే. అంటే వారి రోజువారీ ఆదాయం సుమారు రూ. 12 లక్షలు. ఇప్పుడు వారు తమ బిజినెస్ ను మరింత విస్తరించే పనుల్లో ఉన్నారు. చదివారుగా.. వారి చిన్న ఆలోచన ఎంత పెద్ద స్థాయికి చేర్చిందో.. కావున ఏ వ్యాపారాన్ని చులకనగా చూడకండా మీ ఆర్థిక స్తోమతను బట్టి ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి మీరూ విజయం సాధించండి. ఈ ప్రేమ పక్షులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.