పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో ముప్పున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 సోకి చికిత్స పొందుతున్న వారికి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు విద్యుత్తు, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి ‘యస్’ అనే పేరును ఒమన్ దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి మల్లె పువ్వు అని అర్థం. వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నెల 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తుపానుగా, రేపు పెను తుపానుగా మారే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. శనివారం 59 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ నిన్న మరిన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 30వ తేదీ మధ్య రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.