2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లే వీరిని గిన్నీస్ రికార్డ్ వరకు చేర్చింది. భర్త కంటే భార్య రెండు అడుగుల పొడవు ఎక్కువగా ఉండడంతో అత్యధిక ఎత్తు వ్యత్యాసం ఉన్న జంటగా ఈ ఘనత సాధించారు. ఎత్తు విషయంలో అత్యంత పొట్టి వ్యక్తులు, అత్యంత పొడుగు వ్యక్తులు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం చూశాం. ఓ జంట తమ మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం వల్ల గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ ఎత్తు 3.7 అడుగులు(109.3 సెంటిమీటర్లు), అతడి భార్య క్లోవి ఎత్తు 5.4 అడుగులు(166.1 సెంటిమీటర్లు). వీరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం 1.7 అడుగులు. దీంతో ప్రపంచంలో అత్యంత ఎత్తు వ్యత్యాసం ఉన్న జంటగా గిన్నిస్ రికార్డు దక్కింది. జేమ్స్‌కు డయోస్ట్రోఫిక్ డిస్ప్లాసియా అనే వ్యాధి ఉంది. అరుదైన ఈ వ్యాధి సోకిన వారికి ఎముకల్లో ఎదుగుదల సరిగా లేక ఎత్తు పెరగరు. దీంతో జేమ్స్ ఎదుగుదల 3.7 అడుగులకే నిలిచిపోయింది.
క్లోవి విషయానికొస్తే ఆమె అందరిలాగే సాధారణమైన యువతి. వీరిద్దరూ 2012లో తొలిసారి కలుసుకున్నారు. మనసులు కూడా కలవడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రేమలో పడ్డ కొత్తలో తమను చూసినవాళ్లు ఏం అనుకుంటారోననే భయం ఉండేదని, ఆ తర్వాత ఆ భయాన్ని పక్కన పెట్టేసి వివాహం చేసుకున్నట్లు క్లోవి వెల్లడించారు.
ప్రస్తుతం ఈ జంటకు రెండేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల వీరిద్దరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం గురించి గిన్నిస్ బుక్ సంస్థకు తెలిసింది. దీంతో జేమ్స్-క్లోవి జంటను పరిశీలించి రికార్డు సాధించినట్లు ప్రకటించింది.
ప్రేమకు ఆస్తి – అంతస్తు – అందం – ఎత్తుతో కూడా పనిలేదని ఈ జంట నిరూపించింది. తాను ఎప్పుడూ పొడుగ్గా ఉండే వ్యక్తులనే ఇష్టపడేదాన్నని, కానీ జేమ్స్‌ను కలిశాక తన అభిప్రాయం మారిపోయిందని క్లోవి చెప్పుకొచ్చారు.