హైదరాబాద్- ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అంతకంతకు విజృంభిస్తూ మానవాళిని వణికిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మనుషులకు, జంతువులకు మాత్రమే సోకుతున్న కరోనా.. ఇప్పుడు నీళ్లను కూడా వదలడం లేదు. అవును నీళ్లలో కూడా కరోనా ఆనవాళ్లను గుర్తించారు నిపుణులు. అది కూడా మన హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో. అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సే న్ సాగర్‌లో కరోనా జన్యుపదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగర శివారు ప్రాంతాలైన నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువులోనూ ఈ ఆనవాళ్లు కనిపించాయి. హైదరాబాద్ చెరువుల్లోని నీటి నమూనాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యూలర్ బయాలజీ, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ లు సంయుక్తంగా పరీక్షించాయి. గత ఏడు నెలలుగా హుస్సేన్ సాగర్ తో పాటు ఈ చెరువుల్లోని నీళ్లపై ఈ పరీక్షలు జరపుతున్నారు. చివరికి ఈ నీళ్లలో కరోనా జన్యుపదార్ధాలు ఉన్నట్లు తేలింది.
ఐతే కరోనా వైరస్ జన్యు పదార్థాలు అంత తీవ్రంగా విస్తరించలేదని అధ్యయనంలో తేల్చారు. అంతే కాదు నీటి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని, అందుకు ఎలాంటి ఆధారాల్లేవని అధ్యయనం స్పష్టం చేసింది. హైదరాబాద్ శివారులోని ఎదులాబాద్, పోతురాజ్ చెరువుల్లోని నీటిని కూడా నిపుణులు ఈ అధ్యయనంలో పరీక్షించారు. కానీ ఈ చెరువుల్లోని నీటిలో కరోనా జన్యుపదార్థాల ఆనవాళ్లు మాత్రం కనిపించలేదట. కరోనా బాధితుల మలవిసర్జన వల్లే జన్యుపదార్థాల ఆనవాళ్లు ఆయా చెరువుల్లోని నీటిలో కనిపిస్తున్నాయని నిపుణుల అధ్యయనంలో తేల్చారు. ఆ చెరువులకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి డ్రైనేజీ వ్యవస్థ అనుసంధానమైందని, అందువల్లనే జన్యుపదార్థాలు చెరువుల్లో వ్యాపిస్తున్నాయని తెలిపారు. అయితే, నీటిలో లభించిన జన్యు పదార్థాల ఆనవాళ్లలో వైరస్ అంత ఎక్కువగా లేదని, అందకని ఇది పెద్ద ప్రమాదకరం కాదని నిపుణులు చెప్పారు. సాద్యమైనంతవరకు డ్రైనేజీ వ్యర్ధాలు హుస్సేన్ సాగర్ తో పాటు, మిగతా చెరువుల్లో కలకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు.