హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు.
ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల అంశంపై సుదీర్గంగా చర్చించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. ప్రైవేట్ స్కూల్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తెచ్చేందుకు తెలంగాణ మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల ఫీజుల నియంత్రణతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యపై కొత్త చట్టం తెచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా అంశాలపై అధ్యయనం చేసి విధి విధానాలు తయారుచేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆధ్శర్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. త్వరలో జరగనున్న శాసన సభా శీతాకాల సమావేశాల్లో ఫీజుల నియంత్రణ, ఇంగ్లిష్ మీడియం బోధనకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. సుమారు 7 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు.