అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తరుచూ పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ దిశగా దృష్టి సారించారు చంద్రబాబు.
ఇందులో భాగంగా నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు. బుధవారం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్ నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టిడిపి కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశానికి హాజరయ్యారు.
తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో 20 అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆయా విభాగాల బలోపేతంపై ఈ బేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత ప్రభావవంతంగా పోరాటం చెయ్యాలని అనుబంధ సంఘాల నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
ఈ క్రమంలో చంద్రబాబు ఓ పార్టీ కార్యకర్త మనసులో కోరికను తీర్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త వేణు కొత్త కారు కొన్నాడు. ఐతే కొత్త కారును పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని ఆశపడ్డాడు. తన కొత్త కారును తీసుకుని పార్టీ కార్యాలయానికి వచ్చి, చంద్రబాబు రాగానే తన కారులో ఓ సారి కూర్చోవాలని కోరాడు. కొత్త కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న చంద్రబాబు, పార్టీ కార్యకర్త కోరికను తీర్చారు.