అమ్మ అనే పిలుపు కోసం ప్రతి స్త్రీ హృదయం పరితపిస్తుంది. నవ మాసాలు తన కడుపులో మరో ప్రాణిని మోసి.. జన్మనిచ్చిన వేళ.. ఆ తల్లికి కలిగే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే వివాహం అయిన ప్రతి మహిళ తల్లి కావాలని ఆరాటపడుతుంది. మాతృత్వం కోసం ఆమె మొక్కని దేవుడు.. చూపించుకోని ఆస్పత్రి ఉండదు అంటే అతిశయోకి కాదు. ఇన్ని చేసినా కూడా కొందరిని విధి వెక్కిరిస్తుంది. అమ్మ అనే పిలుపుకి వారిని దూరం చేస్తుంది. అలాంటి వారికి దేవుడిచ్చిన వరంగా మారింది సరోగసీ (అద్దెగర్భం).
ఇది కూడా చదవండి : చిన్నారి రాకతో మా జీవితాల్లోకి సంతోషం వచ్చింది
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సరోగసీ విధానంలో మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవిస్తుండగా.. తాజాగా వారి జాబితాలోకి చేరారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. సరోగసీ విధానం ద్వారా తాను తల్లిని అయ్యానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్న సెలబ్రిటీల ప్రస్తావన తాజాగా మరోసారి తెర మీదకు వచ్చింది. వారు ఎవరంటే..
1.2013లో త బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్య గౌరి తమ మూడో సంతానం అభిరామ్‌కు జన్మనిచ్చింది కూడా సరోగసీ ద్వారానే.
2.బాలీవుడ్ నటి శిల్పాశెట్టి 2020లో సరోగసీ ద్వారా రెండవ బిడ్డగా సమీషా అనే పాపకు జన్మనిచ్చింది.
3.నటి ప్రీతీజింటా కూడా ఈ ప్రక్రియలోనే కవల పిల్లల్ని తమ జీవితంలోకి ఆహ్వనించింది. 2021, నవంబరులో ప్రీతి జింటా, జీన్ గూడెనఫ్ దంపతులు ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు. జై, గియా అంటూ తమ పిల్లల పేర్లను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు.
4.మార్చి 2017లో, దర్శక-నిర్మాత కరణ్ జోహార్ సరోగసీ ద్వారా కవలలకు తండ్రి అయ్యానని ప్రకటించుకున్నాడు.
5.ఇటీవలికాలంలో విడాకులు తీసుకున్న ఆమీర్ ఖాన్ కిరణ్ రావ్ 2011లో సరోగసీ ద్వారా ఆజాద్ రావ్ ఖాన్‌కు జన్మనిచ్చారు.
6.టెలివిజన్ నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత ఏక్తా కపూర్ తన 27వ ఏట జనవరి 2019లో సరోగసీ ద్వారా తన కుమారుడిని స్వాగతించారు.
7.అంతుకుమందు ఆమె సోదరుడు తుషార్ జూన్ 2016లో సరోగసీ ద్వారా తన మగబిడ్డను కని సింగిల్ పేరెంట్‌గా అవతరించాడు.
8.ఇక నటి సన్నీ లియోన్ కూడా సరోగసీ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు తల్లి అని గర్వంగా ప్రకటించింది.
9.బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, ఆయన భార్య దీప్తి సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన 14 ఏళ్ల తర్వాత 2018 సరోగసీ ద్వారా ఆద్యని వారి జీవితంలోకి ఆహ్వానించారు.
10.ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కూడా సరోగసీ విధానం ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.
11.ఇక టాలీవుడ్‌లో మంచు లక్ష్మీ తొలి సరోగసీ మదర్ గా నిలిచారు. అద్దెగర్భం విధానంలోనే మంచు లక్ష్మీ ఒక పాపకు తల్లి అయిన సంగతి తెలిసిందే.
సరోగసీని ఆశ్రయిస్తున్నది ఎవరంటే..
ఆరోగ్యపరంగా తల్లి తండ్రులు కాలేని దంపతులు, జన్యుపరమైన సమస్యలతో తల్లి కాలేని మహిళలు, వివిధ సామాజిక కారణాలరీత్యా సరోగసీ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. సరోగసి అంటే ఒక విధంగా చెప్పాలంటే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకుని తద్వారా సంతానాన్ని పొందడం. ఇందుకు గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలకు డబ్బులు చెల్లిస్తారు. దీనికయ్యే ఖర్చుకూడా తక్కువేమీ కాదు. అయితే అమ్మలు, అమ్మమ్మలు, ఇతర సమీప బంధువుల ద్వారా కూడా బిడ్డల్ని కంటున్నప్పటికి.. ఇలాంటి సంఘటనలు చాలా అరుదు.