తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యోగా, డ్యాన్స్, పర్సనల్ ఫొటోలు అభిమానులకు షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.
పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత టాలీవుడ్‌కు సరిగ్గా సరిపోతుంది. టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లపై నిర్మాతలకు, దర్శకులకు చిన్నచూపు ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వారిలో ఎంత టాలెంట్ ఉన్నా.. పరాయి భాష నటీమణులకు రెడ్ కార్పెట్ పరుస్తారు. ఆ హీరోయిన్ల కోసం కోట్లు ఖర్చు పెట్టి మరీ ఇక్కడ నటించేందుకు చాన్సులు ఇస్తారు. వారికయ్యే అన్ని ఖర్చులను భరిస్తారు. కానీ ఒక తెలుగు అమ్మాయికి కూడా అవకాశాలు ఇచ్చేందుకు మాత్రం వెనుకాడుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ నుండి నెలకో భామైనా తెలుగు చిత్ర పరిశ్రమలోకి దిగుమతి కావాల్సిందే. తెలుగు హీరోయిన్స్ కి ఎంత టాలెంట్ ఉన్నా.. వారిని అస్సలు పట్టించుకోవడం లేదని నటి, నిర్మాత మంచు లక్ష్మి సంచలన కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్‌లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. హీరోయిన్, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటింది. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోయిన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో హాలీవుడ్ సినిమాల్లో నటించాను.. పదేళ్ల క్రితం ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయా. అక్కడే ఉంటే హాలీవుడ్ లో నా రేంజ్ ఎక్కడో ఉండేది.. దేవుడు ఒకవేళ మళ్లీ చాన్స్ ఇస్తే వెంటనే వెళ్లిపోతా’ అని అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ.. ‘తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అస్సలు ఛాన్సులు రావు.. ఇక్కడ హీరోయిన్లను ఏమాత్రం గౌరవించరు. అందం, అభినయం ఎంతో టాలెంట్ ఉన్నా.. తెలుగు ప్రేక్షకులు అధరించరు. ఇక్కడ ప్రేక్షకులు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన హీరోయిన్స్ అంటేనే ఇష్టపడతారు. అక్కడ హీరోయిన్స్ కి ఇచ్చే ప్రియార్టీ తెలుగు హీరోయిన్స్ కి ఒక్కశాతం ఇచ్చినా వాళ్ల స్థాయి ఎక్కడో ఉండేది. ఇక్కడే పుట్టి పెరిగిన నిహారిక కు నటనా పరంగా ఏం తక్కువ? తెలుగు హీరోయిన్స్ బింధు మాధవి, శివాని, శివాత్మిక, మాధవి, మధుషాలిని ఇలా ఎంతోమంది అందం, టాలెంట్ ఉన్నా.. అవకాశాలు రావడం లేదు. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు.. ప్రేక్షకుల ఆలోచనా విధానం మారాలి.. దర్శక, నిర్మాతలు ఇతర రాష్ట్రాల హీరోయిన్లపై ఆసక్తి చూపించకుండా మన తెలుగు హీరోయిన్లకు అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నా’ అని అన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.