సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గ అభవిృద్ది కోసం వచ్చే నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటారు.. అయినా ప్రతిపక్ష నేతలు పలు విమర్శలు చేస్తూనే ఉంటారు.
రాజకీయాలు అన్న తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నిధులు దుర్వినియోగం పై ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా నియోజక వర్గ పరిధిలోని స్థానిక సమస్యలు పరిష్కారానికి, అభివృద్ధి పనులకు వాడే ఎంపీ ల్యాడ్స్ నిధులపై బీజేపీ ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది పనుల కోసం కేటాయించాల్సిన నిధులు తన స్వప్రయోజనం కోసం వాడుకున్నట్లు బీజేపీ ఎంపీ సోయం బాపురావు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాలకు దారి తీస్తుంది. ఈ సంవత్సరం వచ్చిన ఎంపీ ల్యాడ్స్ నిధుల పంపకం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం గురించి వెల్లడించారు. అవును ఈ ఏడాది ఎంపీ నిధులు వచ్చాయి.. కానీ వాటిని ఇంటి నిర్మాణం, తన కుమారుడి పెళ్లి కోసం వాడినట్లు సమావేశంలో తెలిపారు. గతంలో ఉన్న ఎంపీలు మొత్తం నిధులను గోల్ మాల్ చేశారని.. కానీ తాను మాత్రం కొన్ని నిధులే సొంతానికి వాడుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరో ఎంపీ అర్వింద్ ల కన్నా తనకే ఎక్కువ నిధులు వచ్చాయని మరో కాంట్రవర్సీ కామెంట్ చేశారు. నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు పంచకపోవడం వాస్తవమే అన్నారు. అయితే ఎంపీగా కొనసాగుతున్న తనకు ఓ సొంత ఇళ్లు లేకపోవడం గౌరవంగా ఉండదనే ఉద్దేశంతోనే ఇంటిని నిర్మించుకున్నానని… తన కుమారుడి పెళ్లి కూడా చేశానని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సమావేశానికి హాజరైన బీజేపీ నేతలు ఒక్కసారే అవాక్కయ్యారు. ఈసారి నాకు ఐదు కోట్ల నిధులు వస్తాయి.. వాటిని మొత్తం ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. ఇకపై నియోజకవర్గ అభివృద్దికోసం పైలు ఖర్చు చేస్తా అన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ సోయం బాపురావ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి.. అభివృద్ది కోసం ఉపయోగించాల్సిన ఎంపీ ల్యాడ్స్ ని తన ఇష్టానుసారంగా సొంతానికి వాడుకోవడం ఎంత వరకు న్యాయం అంటూ ప్రతిపక్షాలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బాపురావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. మరి ఈ విషయంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.